బ్యాంకులో దొంగతనం.. రూ.15 కోట్ల బంగారు నగల చోరీ.. రూ. 5 లక్షల విలువైన నోట్ల కట్టలు కూడా..

  • కర్నాటకలో మరో భారీ దోపిడీ
  • మంగళూరులోని కోటేకర్ బ్యాంకులో దొంగతనం
  • పట్టపగలే పిస్టల్స్, కత్తులు చూపి ఎత్తుకెళ్లిన ముఠా

బెంగళూరు: కర్నాటకలో వరస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల బీదర్ లో పట్టపగలు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన మరవకముందే తాజాగా మంగళూరులో మరో భారీ చోరీ జరిగింది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మంగళూరులోని ఉల్లాల్ ఏరియాలో ఉన్న కోటేకర్ వ్యవసాయ సహకార బ్యాంకు కేసీ రోడ్ బ్రాంచ్‌‌లో భారీ దొంగతనం జరిగింది. ఆరుగురితో కూడిన దొంగల ముఠా పట్టపగలే తుపాకులు, కత్తులతో బ్యాంకులోకి ప్రవేశించింది. బ్యాంక్ సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి..రూ. 15 కోట్లు విలువైన బంగారు నగలు, రూ.5 లక్షల నగదును దోచుకుంది. అనంతరం దొంగలందరూ కారులో పరారయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు గల ఆరుగురు ముసుగులు వేసుకుని బ్యాంకులోకి ఎంటరయ్యారు.

పిస్టల్, తల్వార్, కత్తి వంటి ఆయుధాలతో బ్యాంకులోని ఐదుగురు ఉద్యోగులు, ఖాతాదారులను బెదిరించారు. బంగారు నగలు, విలువైన వస్తువులను తీసుకుని నల్లటి ఫియట్ కారులో అక్కడి నుంచి పారిపోయారు. చోరీకి గురైన బంగారు నగల విలువ సుమారు రూ.12 నుంచి-15 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు తమలో తాము హిందీ, కన్నడలో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా  తెలిసిందని చెప్పారు. బ్యాంకులోని సీసీటీవీలు పనిచేయడంలేదన్నారు. కారును ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.  నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు.