కరకట్ట కట్టేదెన్నడు ? .. ఆరేళ్లయినా పట్టించుకోని ప్రభుత్వం

  • వరదలతో కోతకు గురవుతున్న గోదావరి ఒడ్డు
  • పొదుమూరు, మంగపేటకు పొంచి ఉన్న ముప్పు
  • కరకట్ట కడుతామని హామీ ఇచ్చిన మంత్రులు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మంగపేట, వెలుగు : వరదల కారణంగా ప్రతియేటా గోదావరి ఒడ్డు కూలిపోతుండడంతో మంగపేట మండల కేంద్రం అతలాకుతలం అవుతోంది. పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. పొదుమూరు ఏరియాలోకి నీళ్లు వస్తుండడంతో వందలాది మంది నిరాశ్రయులవుతున్నారు. మంగపేటలో గోదావరికి కరకట్ట నిర్మిస్తామని ఆరేళ్ల కింద ఇద్దరు మంత్రులు హామీ ఇచ్చినా ఇప్పటివరకూ నెరవేరలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

గోదావరిలో కలిసిన వెయ్యి ఎకరాలు

ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెం నుంచి మంగపేట పుష్కర ఘాట్‌‌‌‌ వరకు ప్రతీ సంవత్సరం వరదలకు గోదావరి ఒడ్డు కోతకు గురవుతోంది. దీంతో ఓ వైపు పంట భూములు దెబ్బతింటుండగా, మరో వైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 20 ఏళ్లల్లో సుమారు వెయ్యి ఎకరాల భూములు గోదావరిలో కలిసిపోయాయి. వరద ఉధృతి పెరిగినప్పుడల్లా పొదుమూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దీంతో సుమారు 200 ఫ్యామిలీలు ఆగం అవుతున్నాయి. ఏ సమయంలో వరద ముంచుకొస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. వరదల వచ్చినప్పుడల్లా జనాలను మంగపేట జడ్పీ స్కూల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.

నెరవేరని మంత్రుల హామీ

మంగపేట పుష్కరఘాట్‌‌‌‌ సమీపంలో కోతకు గురవుతున్న భూములను, గోదావరి వరద ఉధృతిని 2016 సెప్టెంబర్ 26న అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, అజ్మీరా చందూలాల్‌‌‌‌ పరిశీలించారు. వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు మంత్రులకు చెప్పడంతో స్పందించిన వారు గోదావరి తీరం వెంట కరకట్ట నిర్మించి భూములు కోతకు గురి కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. 

కరకట్ట నిర్మాణం కోసం రూ.102 కోట్లు కేటాయించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారే తప్ప ఆరేండ్లు అవుతున్నా ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు. 2020 ఆగస్టులో గోదావరి వరదలను, మంగపేట పుష్కరఘాట్‌‌‌‌ను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ మాలోత్ కవితను పొదుమూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో గోదావరి వరదల వల్ల పొలాలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా కరకట్ట నిర్మించాలని ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీలో ప్రస్తావించినా సర్కార్‌‌‌‌ నుంచి ఎలాంటి స్పందన లేదు.

మూడెకరాలు కొట్టుకుపోయింది 

మాకున్న భూమిలో ఇప్పటికే మూడెకరాలు గోదావరి వరదలకు కొట్టుకుపోయింది. గోదావరి ఒడ్డునే మరో 10 ఎకరాలు ఉంది. మళ్లీ వరదలు వస్తే ఆ భూమి కూడా ఉంటుందన్న నమ్మకం లేదు. మా భూములతో పాటు  పొదుమూరు గ్రామం కూడా కొట్టుకుపోతదని భయంగా ఉంది. సర్కార్‌‌‌‌ స్పందించి కరకట్ట పనులు స్టార్ట్‌‌‌‌ చేయాలి.

 పల్నాటి నర్సింహారావు, పొదుమూరు గ్రామ రైతు