మామిడి రైతులకు మళ్లీ నష్టాలే .. దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతులు

  • సీజన్ మొదలువుతున్నా తోటలకు పూత పట్టట్లే
  •  వాతావరణ మార్పులే కారణమంటున్న ఆఫీసర్లు
  •  సూర్యాపేట జిల్లాలో 11 వేల ఎకరాల్లో సాగు

సూర్యాపేట, వెలుగు: మామిడి రైతులకు ఈ సారి కూడా నష్టాలు తప్పేలా లేవు. సీజన్‌‌‌‌‌‌‌‌ మొదలవుతున్నా.. తోటల్లో చాలావరకు పూత పట్టలేదు.  దీంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్లు అధిక వర్షాలతో పూత, కాయపై ప్రభావం పడి నష్టపోయామని,ఈ సారైనా గట్టెక్కుతామనుకుంటే నిరాశే ఎదురయ్యేలా ఉందని వాపోతున్నారు. కాగా, వాతావరణ మార్పులే ‘మామిడి’ దిగుబడి తగ్గేందుకు కారణమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
  
11వేల ఎకరాల్లో సాగు

సూర్యాపేట జిల్లాలో రైతులు 11వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఇక్కడ పండే మామిడికి దేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది.  సీజన్ ప్రకారం డిసెంబర్ నుండే చెట్లకు పూత పుట్టాలి. జనవరిలో పిందెలు మొదలయ్యి మార్చిలో కాయ దశకు చేరుకుంటాయి. కానీ, మార్చి సగానికి వచ్చినా చాలా చెట్లకు పూత కనిపించడం లేదు.  తోటల్లో 30 శాతం పూత కూడా లేదని రైతులు చెబుతున్నారు. లేట్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన పూత కూడా తేనెమంచు పురుగు కారణంగా రాలిపోతోందని 
వాపోతున్నారు.  

వర్షాభావ పరిస్థితులే కారణం

మామిడి పూత ఆలస్యానికి వర్షాభావ పరిస్థితులే కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. చలి తీవ్రత ఆధారంగా మామిడికి పూత పడుతుంది. కానీ, గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చలి తక్కువగా ఉండడం, జనవరి చివరి నుంచే ఎండలు మొదలయ్యాయి. దీనికి తోడు ఈ సారి చెరువులు ఎండిపోవడంతో బోర్లలో భూగర్భజలాలు తగ్గిపోయాయి.  దీంతో పంటకు సరిపడా నీళ్లు అందలేదు.  ముఖ్యంగా పిందెలు ఏర్పడ్డాక మార్చి, ఏప్రిల్ వరకు క్రమం తప్పకుండా చెట్లకు నీళ్లు పెట్టాలి.  కానీ, జిల్లాలోని చాలాచోట్ల ఇప్పటికే బోర్ల నుంచి సరిపడా నీళ్లు రావడం లేదు.  కాల్వలకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేదు. దీంతో మరింత నష్టం తప్పేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కౌలు రైతులే అధికం

జిల్లాలో 11 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా..  వాటిని ఎక్కువగా కౌలురైతులే గుత్తకు తీసుకుంటున్నారు. గత రెండేళ్లు అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఈ సారి వర్షాభావ పరిస్థితులు దెబ్బకొడుతున్నాయి. దిగుబడి తగ్గిపోవడంతో పంటను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మార్కెట్లకు తరలించే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. సూర్యాపేటలో మార్కెట్ సౌకర్యం లేకపోవటంతో దళారులు చెప్పిన ధరకు  అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.  ప్రస్తుతం దిగుబడి చూస్తే క్వింటాకు రూ.60 నుంచి రూ.70 వేల  పలికితే తప్ప గిట్టుబాటు కాదని అంటున్నారు. కానీ, దళారులు రూ. 25 నుంచి రూ.30 వేలు ఇస్తామంటున్నారని, అలా అయితే పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కౌలు పూడే పరిస్థితి లేదు 

40 ఎకరాలు మామిడి తోట కౌలుకు తీసుకున్న. పెట్టుబడి ఇప్పటికే రూ.5 లక్షలు దాటింది.  గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. నవంబర్ నుంచి ఎన్ని మందులు కొట్టినా పూత రాలేదు.  ఈ సారి  కౌలు పూడే పరిస్థితి లేదు.  

 బోళ్ల సురేశ్, వెంపటి గ్రామం, తుంగతుర్తి 

ఆరేండ్లుగా  నష్టాలే 

20 ఏండ్ల కింద మామిడి తోట పెట్టిన. ముందు బాగానే ఉన్నా ఆరేండ్లుగా నష్టాలు వస్తున్నయ్. ఆశించిన స్థాయిలో మామిడికాయలు కాయకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.  మామిడి చెట్లను తీసివేసి వేరే పంటలు వేసుకోవాలనుకుంటున్న.

ఏళ్లబోయిన నరసయ్య, తుంగతుర్తి