- నాణ్యత లేని కాయలు, తగ్గిన దిగుబడి
- ఆవకాయకు పచ్చడి కాయలు కూడా కష్టమే
ఖమ్మం, వెలుగు: మామిడి రైతులకు ఈ ఏడాది కూడా కన్నీళ్లే మిగులుతున్నాయి. కష్టనష్టాల మధ్య ఏళ్ల తరబడి తోటలను సాగు చేస్తున్నా.. కొన్నేళ్లుగా పంట దిగుబడి రావడం లేదు. వాతావరణ ప్రభావం మామిడిపై తీవ్రంగా ఉండగా.. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల ఏటా నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా మామిడి పూత తక్కువగా రావడంతోనే దిగుబడి తగ్గనుందని స్పష్టమైంది. అయితే చెట్లపై ఉన్న పూత, కాయలుగా మారినా ఆ కాయలు కూడా చెట్లపై నిలవడం లేదు. పక్వానికి వచ్చిన ఒక్క కాయ కొస్తుంటే, దాని పక్కనే ఉన్న మరో రెండు మూడు కాయలు కూడా రాలిపోతున్నాయి.
దీనికి తోడు మంగు వస్తుండడంతో కాయ క్వాలిటీ లేకుండా పోతోంది. అసలే దిగుబడి తక్కువ, రేటు కూడా అంతంత మాత్రమే ఉంది. ఎండ వేడిమి, బోర్లలో నీళ్లు కూడా వేడిగా వస్తుండడంతో కాయ నాణ్యత దెబ్బతింటుందని మామిడి రైతులు చెబుతున్నారు. మామిడి పండ్లు కాదు, ఆవకాయకు పచ్చడి మామిడి కాయలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 44 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 32 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 వేల ఎకరాల్లో తోటలున్నాయి.
వరుసగా ఐదారేళ్లుగా మామిడి తోటలపై లాభాలు లేకపోవడంతో చాలా మంది రైతులు తోటలను తొలగించి, ఆయిల్ పామ్ వైపు మొగ్గుచూపిస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల మామిడి రైతులే సొంతంగా తోటలను మెయింటెయిన్ చేస్తుండగా, మరికొందరు రైతులు కౌలుకు ఇస్తున్నారు. దిగుబడి సరిగా రాని సమయంలో కౌలు రైతులే నష్టపోతున్నారు. యేటా ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ కు పెద్ద లారీల్లో ఎగుమతి చేస్తారు. వ్యాపారులు ఎక్కడికక్కడ పెద్ద రేకుల షెడ్లతో కొనుగోలు కేంద్రాలు (మండి)లను ఏర్పాటు చేస్తారు.
తోటల నుంచి మామిడి కాయలను కొనుగోలు చేసి, మండిలలో గ్రేడింగ్ చేసి, ఎగుమతి చేస్తారు. ఈసారి మాత్రం గతం కంటే తక్కువగానే మండిలు ప్రారంభమయ్యాయి. నాణ్యమైన కాయలు టన్నుకు రూ.50 నుంచి 60 వేలు పలుకుతున్నాయి. మంగుతో దెబ్బతిన్న కాయలు మాత్రం రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు మాత్రమే రేటు పడుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, నల్లి తెగులు కారణంగా మామిడి పూత నిలవలేదు. దీంతో మామిడి చెట్లకు 8 నుంచి పది సార్లు మందులు పిచికారి చేయాల్సి వచ్చింది. గతేడాది ఎకరాకు 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తే, ఈసారి మాత్రం 2 నుంచి 3 టన్నులు రావడం కూడా కష్టమేనని రైతులు చెబుతున్నారు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని బాధపడుతున్నారు.
20 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి చూడలేదు
కల్లూరు మండలంతో పాటు ఇతర మండలాల పరిధిలో 100 ఎకరాల వరకు మామిడి తోటలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో తుఫాను వల్ల కురిసిన అకాల వర్షాల వల్ల వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండి మామిడి పూత ఆలస్యమైంది. డిసెంబర్, జనవరి చివరికల్లా రావలసిన మామిడి పూత ఫిబ్రవరి నెల చివరికి వచ్చింది.
మార్చి మొదటి వారంలో చిన్న చిన్న మామిడి పిందెలు వచ్చాయి. పూత సమయంలో తామరనల్లి ఆశించటం వలన వచ్చిన అరకొర కాయలు, రాతి మంగు ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నాయి. కోల్పోయింది. ఈ ఏడాది కొన్ని చెట్లకు 50 నుంచి 100 కాయల లోపు మాత్రమే కాసాయి. ఎండ వేడిమి, అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కాయ సైజు లేకపోవడంతో రాలిపోతున్నాయి. చేతి కందివచ్చిన కాయలు కోసి మార్కెట్లో అమ్ముకుందాం అనుకుంటే టన్ను రూ.20 వేలనుంచి రూ.50 వేల లోపు రేటు ఉంది. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఏర్పడనటువంటి గడ్డు పరిస్థితి ఈసారి వచ్చింది. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టమే.
సయ్యద్ నబి, మామిడి తోటల కౌలు రైతు, కల్లూరు
దిగుబడి పూర్తిగా పడిపోయింది
గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం మామిడి దిగుబడి తక్కువ ఉంది. టన్ను బంగిన పల్లి రూ.50 నుండి 55 వేల వరకు ధర పలుకుతుండగా, తోతాపూరి రూ.30 నుండి రూ. 35 వేల ధర ఉంది. ఈ ఏడాది కాసిన కాపులో కూడా నల్లి తెగులు మామిడిని డ్యామేజ్ చేసింది. రూ.వేల ఖర్చు చేసి మందులు పిచికారీ చేసినా ఈ తెగులును అడ్డుకోలేకపోయాయి. ఈ సీజన్లో మామిడి వ్యాపారులకు లక్షల్లో నష్టం కలుగుతుంది. కనీసం పచ్చడి కాయలు దొరకడం కూడా కష్టమే.
జంపా వియన్న బాబు, మామిడి తోటల వ్యాపారి, పెనుబల్లి