
- నిండా మునుగుతున్న మామిడి రైతు.. కమీషన్ ఏజెంట్లు సిండికేట్ కావడంతో రైతులకు నష్టం
- జగిత్యాల మ్యాంగో మార్కెట్లో ఓపెన్ ఆక్షన్ కు తూట్లు
- బహిరంగ మార్కెట్ లో టన్నుకు రూ. 65 వేల నుంచి రూ.70 వేలు
- ఓపెన్ యాక్షన్ లో రూ. 30 వేల నుంచి ప్రారంభం, రూ. 40 వేలకు ముగింపు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మ్యాంగో మార్కెట్లో మామిడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో టన్నుకు రూ.65 వేల నుంచి రూ.70 వేల ధర పలుకుతుండగా, మ్యాంగో మార్కెట్లో నిర్వహిస్తున్న ఓపెన్ ఆక్షన్లో మాత్రం రూ.30 వేల నుంచి రూ.40 వేల ధర మించడంలేదు. కమీషన్ ఏజెంట్లు సిండికేట్ గా మారి తమను దగా చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల్లోనూ జగిత్యాల మామిడికి క్రేజ్..
జగిత్యాల జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో 35 వేల ఎకరాలకు పైగా మామిడి సాగు అవుతోంది. ముఖ్యంగా బంగినపల్లి రకం ఎక్కువగా సాగు చేస్తారు. ఈ మామిడికి మార్కెట్ లో జగిత్యాల మామిడిగా మంచి క్రేజ్ వచ్చింది. ఈ రకానికి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. జగిత్యాల మాంగో మార్కెట్ నుంచి నాగపూర్, ముంబై, ఢిల్లీకి మామిడి ఎగుమతి అవుతుంది. ఆయా మార్కెట్ల నుంచి ప్రత్యేకంగా ప్యాక్ చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. విదేశాలకు ఎగుమతి అయ్యే వాటిలో బంగినపల్లి, చెరకు రసాలు, మల్గొబా వంటి రకాలు ఉన్నాయి. ఇంత క్రేజ్ ఉన్న జగిత్యాల మామిడి పండ్లకు బహిరంగ మార్కెట్లో మంచి ధర పలుకుతున్నప్పటికీ, వాటిని పండించిన రైతులు మాత్రం నష్టపోతున్నారు.
సిండికేట్ తో కనిపించని ఓపెన్ మార్కెట్..
ఈ నెల 11న జగిత్యాల మ్యాంగో మార్కెట్ లో మామిడి ధర నిర్ణయించేందుకు బహిరంగ వేలం(ఓపెన్ ఆక్షన్) నిర్వహించారు. అయితే ఒక రోజు ముందు వరకు కమీషన్ ఏజెంట్లు కాయను బట్టి టన్నుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కొనుగోలు చేశారు. కానీ, మామిడి మార్కెట్ లో నిర్వహించిన బహిరంగ వేలం లో కమీషన్ ఏజెంట్లు టన్నుకు రూ.30 వేల నుంచి ప్రారంభించి రూ.45 వేలకు ముగించారు.
వాస్తవానికి కాయను బట్టి ఓపెన్ మార్కెట్ లో వేలం వేస్తే రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నా, సిండికేట్ గా మారిన కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కు తరలించిన మామిడికాయల నాణ్యత సరిగా లేదని, గ్రేడ్ వంటి సాకులు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటికే తేనె మంచు, నల్ల తామర ప్రభావంతో నష్టపోయిన మామిడి రైతులు పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి కూడా రావట్లే
ఢిల్లీ, పూణే వంటి ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ జగిత్యాల మామిడికి డిమాండ్ ఉంది. అక్కడి నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో, కమీషన్ ఏజెంట్లు నిర్ణయించిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. కమీషన్ ఏజెంట్లు సిండికేట్ కాకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.
- నీలం పెద్దులు, మామిడి రైతు, జగిత్యాల
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
రైతులు బహిరంగ వేలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాయకు సరైన ధర వస్తుంది. అలాగే కమీషన్ ఎజెంట్ల వద్ద సేల్ బిల్ ఖచ్చితంగా తీసుకోవాలి. 24 గంటల్లో అమ్మిన మామిడికి కమీషన్ ఎజెంట్లు డబ్బులు చెల్లించాలి. ఎవరైనా కమీషన్ ఎజెంట్లు సిండికేట్ గా మారినట్లు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటాం. - రాజశేఖర్, చల్ గల్ మ్యాంగో మార్కెట్ సెక్రటరీ