
- పంట దిగుబడిపై రైతుల ఆందోళన
- వాతావరణ మార్పులతో తగ్గిన దిగుబడి
- ధరలను అనుకూలంగా మార్చుకుంటున్న సిండికేట్ వ్యాపారులు
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో మామిడి రైతులు ఎన్నడూలేని కష్టాలను ఎదుర్కొంటున్నారు. తోటలకు పూత, కాత రాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈసారి కూడా పంట దిగుబడులపై ఎఫెక్ట్ పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాగయ్యే మామిడికి వివిధ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయినా మామిడి పండిస్తున్న రైతులు మాత్రం మూడేళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
11 వేల ఎకరాల్లో మామిడి..
సూర్యాపేట జిల్లాలో 11,250 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. గతేడాది ఆధిక వర్షాలతో పూత, కాతపై ఎఫెక్ట్ పడింది. దీనితో దిగుబడులు తగ్గిపోవడంతో రైతులతోపాటు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి మంచి లాభలొస్తాయని ఆశించిన రైతులకు మళ్లీ నిరాశే ఎదురవుతోంది. జిల్లాలోని చాలా మండలాల్లో తోటలకు 30 శాతం పూత రాలేదు. డిసెంబర్ నుంచే చెట్లకు పూత పుట్టాలి. జనవరి నుంచి పిందెలు రావాలి. కానీ మార్చి వచ్చిన చాలా చెట్లకు పూత, కాత కనిపించడం లేదు. గతేడాది రైతులు నష్టాలను చవిచూడడంతో జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా మామిడి తోటల సాగు తగ్గించారు.
వాతావరణ మార్పులే కారణం..?
మామిడి ఆలస్యం కావడానికి వాతావరణంలో వచ్చే మార్పులే కారణమని అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత ఆధారంగా మామిడి పూత పుట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్ లో చలి తక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆ ఎఫెక్ట్ మామిడి పంటపై పడింది. మరోవైపు ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చెరువులు, కాల్వల కింద నీరు లేకపోవడంతో వానాకాలం పంటలను కూడా బోర్ల ఆధారంగా సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. దీని ప్రభావం మామిడి తోటలపై పడింది. ముఖ్యంగా పిందెలు ఏర్పడ్డాక మార్చి, ఏప్రిల్ వరకు చెట్లకు నీరు పెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిగుబడి తగ్గినా పెరగని ధర..
వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరగాలి కానీ.. అందుకు భిన్నంగా ఈసారి ధరలు దారుణంగా పడిపోయాయి. క్వింటాల్‌కు రూ.60 నుంచి రూ.70 వేల వరకు పలికితే తప్ప.. గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గిపోవడంతో పంటను హైదరాబాద్ వంటి మార్కెట్లకు తరలించే పరిస్థితి లేకుండాపోయింది. సూర్యాపేటలో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దళారులు చెప్పిన ధరకు రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. జిల్లాలో 11 వేల ఎకరాల వరకు మామిడి తోటలు ఉండగా, వాటిని కౌలు రైతులే గుత్తకు తీసుకుంటారు. అలాంటి రైతులంతా ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయారు.
మామిడికి ధర లేదు..
మామిడికాయలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. తరచూ మబ్బులు, మంచు రావడంతో పూత నిల్వక కాయ తగ్గిపోయింది. కాసిన కాయకు ధర లేక ఇబ్బందులు పడుతున్నాం. వరంగల్ మార్కెట్ లో రూ.20 వేల నుంచి 30 వేల వరకే రేటు పెడుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
- ఈడుమల్ల యాకన్న, గొట్టిపర్తి గ్రామం, తుంగతుర్తి మండలం