మామిడి చెట్లు నరికేసి పామాయిల్ సాగు

  • రాష్ట్రంలో 5 లక్షల నుంచి 3 లక్షల ఎకరాలకు తగ్గిన మామిడి తోటలు

ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలోని మామిడి రైతులు పామాయిల్ సాగు వైపు మళ్లుతున్నారు. కొన్నేండ్లుగా వడగండ్ల వానలు, ఈదురుగాలుల వల్ల నష్టాలు వస్తుండడంతో మామిడి తోటలను తీసేస్తున్నారు. మామిడి చెట్లను నరికేసి పామాయిల్ మొక్కలు నాటుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల మామిడి చెట్లకు పూత, పిందె నిలవడం లేదు. చెట్లు ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాయడం లేదు. అదృష్టం బాగుండి పిందె నిలబడినా.. అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలుల వల్ల కాయలు రాలిపోతున్నాయి. దీనికి తోడు కోతుల బెడద కూడా ఎక్కువైంది.

చివరకు ఎంతోకొంత దిగుబడి రైతుల చేతికొచ్చినా, పంటను అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌలతులు లేక గిట్టుబాటు ధర దక్కడం లేదు. దీంతో కర్నూల్, బీదర్, గుల్బర్గా, నాగ్​పూర్ ​మార్కెట్లకు పంటను తరలించాల్సి వస్తోంది. అక్కడికి తీసుకెళ్లాక ధర ఉంటే లాభం వస్తోంది. లేదంటే నష్టమే మిగులుతోంది. మరోవైపు మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి  ప్రోత్సాహకాలు అందడం లేదు. దీంతో ఆ రైతులు నష్టపోతుండటంతో మామిడి తోటలను తీసేసి, వాటి స్థానంలో పామాయిల్ సాగు మొదలుపెడ్తున్నారు. 

అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి.. 

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలు ఉండేవి. ప్రస్తుతం 3 లక్షల ఎకరాలకు తోటలు తగ్గిపోయాయని అధికారులు చెబుతున్నారు. మామిడికి ఫేమస్ అయిన ఖమ్మం జిల్లాలో ఐదారేండ్ల కింద 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా.. గతేడాది 34 వేల ఎకరాలకు, ఇప్పుడు 31 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. మంచిర్యాల జిల్లాలోనూ గతేడాది వెయ్యి ఎకరాల్లో మామిడి తోటలను తీసేశారు. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

పామాయిల్ సాగుకు ప్రోత్సాహకాలు .. 

వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలో 8 లక్షల 9 వేల 371 హెక్టార్లలో పామాయిల్ సాగు చేయాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం సాగవుతున్నది 36,421 హెక్టార్లలో మాత్రమే. ఈ క్రమంలో పామాయిల్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. పామాయిల్ మొక్కలకు సబ్సిడీ ఇవ్వడం, ఉపాధి హామీ పథకం కింద గుంతలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది. డ్రిప్ సబ్సిడీ కేవలం పామాయిల్ సాగుకే పరిమితం చేసింది. దీనికి తోడు పామాయిల్ పంటకు కోతులతో నష్టం లేకపోవడం.. అంతర పంటలుగా నువ్వులు, కోకో, జీడి మామిడి లాంటివి సాగు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండడంతో పామాయిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఏటా పామాయిల్ సాగు పెరుగుతోంది. 2020- –21లో 5 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలు ఉండగా, 2021–-22లో 8,060 ఎకరాలు, 2022–23లో 19,612 ఎకరాలకు పెరిగాయి. పామాయిల్​ సాగుతో భూగర్భ జలాలు, కరెంట్ ​వినియోగం బాగా పెరుగుతుందని..  భవిష్యత్తులో ఎడారి తరహా పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నా పామాయిల్ సాగు లక్ష్యంపై సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. 

3 లక్షల నష్టం.. 

నాకు పదెకరాల మామిడితోట ఉంది. వానలు, గాలిదుమారాలతో ఏటా నష్టపోతున్నం. ఈ ఏడాది రూ.3 లక్షల నష్టం వచ్చింది. అందుకే మామిడి తోట తీసేసి, పామాయిల్ సాగు చేద్దాం అనుకుంటున్న. 

- మాదల వెంకటేశ్వరరావు, కొత్తకారాయిగూడెం

పామాయిల్​పై రైతుల ఆసక్తి.. 
రైతులు చాలామంది పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జామ, సీతాఫలం, మామిడి, నిమ్మ తోటలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. పామాయిల్ సాగుకు మాత్రమే డ్రిప్ ను సబ్సిడీపై అందిస్తున్నాం. అంతర పంటల ద్వారా వచ్చే అదనపు ఆదాయం కూడా రైతుల ఆసక్తికి కారణం కావొచ్చు. 

- అనసూయ, హార్టికల్చర్ ఆఫీసర్, ఖమ్మం