మ్యాంగో మార్కెట్​కు మోక్షమెప్పుడో?..ఎనిమిదేండ్లుగా పెండింగ్​లోనే నిర్మాణం

  • ఏటా ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులు
  • ‌‌నాగ్​పూర్​కు రవాణా చేస్తూ ఇబ్బందులు
  • బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ నిర్మాణంపై ఆశలు 
  • మంచిర్యాల జిల్లాలో 20 వేల ఎకరాల్లో మామిడితోటల సాగు  
  • ఏటా రూ.100 కోట్లకు పైగా దిగుబడులు 

మంచిర్యాల, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లాలోని మామిడి రైతులకు నిరాశే మిగిలింది. క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకోగా, 2016లో బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్​ నిర్మించేందుకు రూ.2.54 కోట్లతో ప్రారంభించింది. కానీ, ఎనిమిదేండ్లుగా మార్కెట్​ పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. దీంతో వ్యయప్రయాసలకు ఓరుస్తూ 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగ్​పూర్​కు సీజన్​లో మామిడి పంటను తరలిస్తున్నారు. ప్రస్తుతం మామిడి సీజన్​ కావడం,  రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని మామిడి రైతులు కోరుతున్నారు. 

ఎనిమిదేండ్లుగా పెండింగ్ లోనే..

2016లో అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్ బెల్లంపల్లిలో రూ.2.54 కోట్లతో మ్యాంగో మార్కెట్​ను శాంక్షన్​ చేసి, ఫస్ట్ ఫేస్​లో రూ.1.26 కోట్లను రిలీజ్​ చేసింది. ఈ ఫండ్స్​తో స్థానిక అగ్రికల్చర్​ మార్కెట్ యార్డు ఆవరణలో 10 వేల టన్నుల కెపాసిటీతో రెండు కవర్ షెడ్లను నిర్మించారు. ఫండ్స్​ కొరతతో మామిడి కాయలను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ యూనిట్, ఇతర పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.1.18 కోట్లను శాంక్షన్ చేయగా, అప్పటి ఎమ్మెల్యే సీసీ రోడ్డు, మరో కవర్ షెడ్​, ఆర్వో ప్లాంట్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఇందులో ఇంకా కవర్ షెడ్ నిర్మించలేదు. కోల్ట్​ స్టోరేజీ యూనిట్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది.

నాగపూర్​కు తరలుతున్న జిల్లా మామిడి..

మంచిర్యాల జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతుండగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 20వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. బెల్లంపల్లి, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, జైపూర్, చెన్నూర్, మందమర్రి, కాసిపేట, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లో దాదాపు 50 ఏండ్ల నుంచి మామిడి తోటలను పెంచుతున్నారు. ఎకరానికి సగటున ఐదు నుంచి ఏడు టన్నుల లెక్కన ఏటా సుమారు రూ.100 కోట్లకు పైగా దిగుబడులు వస్తున్నాయి. 

ఇక్కడ మామిడి మార్కెట్ లేకపోవడంతో రైతులు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ​పూర్​కు తీసుకెళ్తున్నారు. అక్కడ బ్రోకర్లు, కమిషన్​ ఏజెంట్లు సిండికేట్​గా మారి రైతులను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఒక్కోసారి రవాణా చార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, ఎంతో దూరంలో ఉన్న నాగ్​పూర్​ మార్కెట్​లో కనీస మద్దతు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు విసుగుచెందుతున్నారు. దీనికితోడు యాజమాన్య పద్ధతులపై హార్టికల్చర్​ అధికారుల నుంచి సరైన సలహాలు, సూచనలు అందక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలువురు రైతులు మామిడి తోటలను తొలగిస్తున్నారు. 

కాంగ్రెస్​ సర్కారుపై ఆశలు...  

జిల్లాలోని మామిడి తోటలు ప్రస్తుతం పిందె, కాత దశలో ఉన్నాయి. మరో నెల రోజుల్లో దిగుబడులు చేతికొస్తాయి. ఈలోగా మ్యాంగో మార్కెట్ పెండింగ్​ పనులను పూర్తి చేసి, ఈ సీజన్​ నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో పండిస్తున్న నాణ్యమైన మామిడి కాయలకు దేశవ్యాప్తంగా డిమాండ్​ఉంది. నాగపూర్​ మార్కెట్​లో పంజాబ్​, హర్యాన, ఢిల్లీ, రాజస్థాన్​, గుజరాత్​, కోల్​కతా రాష్ర్టాలకు చెందిన ట్రేడర్లు భారీగా బిజినెస్​ చేస్తుంటారు. వారితో చర్చించి బెల్లంపల్లికి రప్పించగలిగితే తమ కష్టాలు తీరుతాయని, దీనికోసం ఎమ్మెల్యే గడ్డం వినోద్​ చొరవ తీసుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.