మహబూబ్​నగర్ లో మామిడి రైతుకు  కష్టకాలం

మహబూబ్​నగర్ లో  మామిడి రైతుకు  కష్టకాలం

మహబూబ్​నగర్, వెలుగు: మూడేండ్లుగా పాలమూరు మామిడి రైతులు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. సీజన్​ మొదలవుతున్నా తోటలకు ఇప్పటి వరకు పూత పట్టకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పూత లేట్​ కావడంతో నిరుడు మాదిరిగానే ఈసారి కూడా దిగుబడులపై ఎఫెక్ట్​ పడి నష్టాలు వస్తాయేమోనని దిగులు చెందుతున్నారు.

60 వేల ఎకరాల్లో..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో 20,642 మంది రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. గతేడాది అధిక వర్షాలతో పూత, కాతపై ఎఫెక్ట్​ పడింది. దీంతో దిగుబడులు తగ్గిపోవడంతో రైతులతో పాటు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, ఈసారి మంచి లాభాలొస్తాయని ఆశించినా రైతులకు మళ్లీ  నిరాశే ఎదురవుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని మామిడి తోటలకు పూత సరిగ్గా పట్టలేదు.

చాలా మండలాల్లో తోటలకు 30 శాతం పూత కూడా లేదు. సీజన్​ ప్రకారం డిసెంబర్​ నుంచే చెట్లకు పూత పట్టాలి. జనవరి నుంచి పిందెలు రావాలి. కానీ, జనవరి చివరి వారం వచ్చినా చాలా చెట్లకు పూత కనిపించడం లేదు. అక్కడక్కడా కొన్ని చెట్లకు మాత్రమే పూత ఉంది. దీంతో ఈసారి కూడా దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.పంట కాలం కూడా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 

వెంటాడుతున్న నీటి కష్టాలు..

ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఉమ్మడి జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చెరువులు, కాల్వల కింద నీరు లేకపోవడంతో వానాకాలం పంటలను కూడా బోర్ల ఆధారంగా సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. దీని ప్రభావం మామిడి తోటలపై పడనుంది. చెట్లకు లేట్​ ఫ్లవరింగ్​ వస్తుండటంతో ఫిబ్రవరి రెండో వారం నుంచి పిందెలు వచ్చే అవకాశం ఉంది. అయితే పిందెలు ఏర్పడ్డాక నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మార్చి, ఏప్రిల్​ వరకు తోటలకు నీరు పెట్టాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం గ్రౌండ్​ వాటర్​ పడిపోవడంతో మార్చి, ఏప్రిల్​లో బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొమ్మ కత్తిరింపుపై అవగాహన లేకనే..

మామిడి చెట్లకు కొమ్మ కత్తిరింపుల గురించి రైతులకు హార్టికల్చర్​ ఆఫీసర్లు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి సీజన్​లో మామిడి కోసిన తరువాత జూన్, జూలై నెలల్లో చెట్ల కొమ్మలను కత్తిరించాలి. కొమ్మలు, ఆకులు, మొద్దులకు గాలి, వెలుతురు, ఎండ తగిలేలా అదనంగా ఉన్న​కొమ్మలు నరికేయాలి. రోగం వచ్చిన కొమ్మలను తీసేయాలి. ఇలా కొమ్మలను తీసేయడం వల్ల ఆగస్టు వరకు కొత్త కొమ్మలు ఏర్పడతాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్​ నెలల్లో వీటికి రెస్ట్​ దొరుకుతుంది. దీంతో డిసెంబరు నుంచే ఈ కొమ్మలకు పూత పడుతుంది. కానీ, ఈ విధానంపై రైతులకు అవగాహన లేక ఏటా లేట్​ ఫ్లవరింగ్​తో నష్టపోతున్నారు. 

ఆఫీసర్లు ఏమంటున్నారంటే..

మామిడి పూత పట్టని తోటలకు ఒక తడి నీటిని ఇవ్వాలని హార్టికల్చర్​ ఆఫీసర్లు సూచిస్తున్నారు. గతేడాది మే, జూన్, జూలై వరకు హార్వెస్టింగ్​ చేయడం వల్ల ఫ్లవరింగ్​ ఆలస్యమైందని చెబుతున్నారు. జనవరి ఎండింగ్​ నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోపు అన్ని తోటలకు ఫ్లవరింగ్​ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ ఫ్లవరింగ్​ రాకుంటే ఒక తడి నీటిని ఇవ్వాలని రైతులకు సూచిస్తున్నారు. పిందె సైజు వచ్చాక మళ్లీ నీటి తడులు ఇవ్వాలి. పిందెలు వచ్చాక అవి రాలకుండా ఉండడానికి ప్లానోఫిక్స్​ను స్రే చేస్తే సరిపోతుంది.