
- నీటి ఎద్దడి కారణంగా రాలిపోతున్న మామిడికాయలు
- ఉన్న కాయల సైజు, క్వాలిటీ అంతంతే...
- ఆందోళనలో మామిడి రైతులు
- నీటి తడులతో పాటు మందులు స్ర్పే చేయాలంటున్న ఆఫీసర్లు
మహబూబ్‌నగర్, వెలుగు : ఈ సీజన్‌లో మామిడి పూత మంచిగా రావడంతో పెద్ద మొత్తంలో దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ తప్పడం లేదు. ఓ వైపు ఎదిగిన కాయలు ఎదిగినట్లే రాలిపోతుండగా.. మరోవైపు నిలిచిన కాయలు సైతం తక్కువ పరిమాణంలో ఉండి, క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో దిగుబడి, ధరపై మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. వాతావరణంలో మార్పులే ఇందుకు కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు.
వాతావరణంలో మార్పులు...రాలుతున్న కాయలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 17 వేల మంది రైతులు 52,912 ఎకరాల్లో మామిడితోటలు సాగు చేశారు. స్టెమ్ కటింగ్ పద్ధతులను పాటించిన రైతులకు చెందిన తోటల్లో డిసెంబరు నుంచి పూత మొదలైంది. జనవరి చివరి నుంచే ఆ చెట్లకు పిందెలు వచ్చి కాయలు పట్టాయి. ఫిబ్రవరి నుంచి పూత స్టార్ట్ అయిన తోటల్లో మామిడి చెట్లకు ఈ నెల మొదటి వారం నుంచి పిందెలు పడుతున్నాయి.
కానీ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి తోటలపై ప్రభావం పడుతోంది. దీనికి తోడు గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోవడం వల్ల కూడా చెట్లకు అవసరమైనంత నీరు అందడం లేదు. దీంతో పూత బాగానే పట్టినా, విపరీతంగా కాస్తున్న ఎండల వల్ల చెట్ల మీద నుంచి పిందెలు, కాయలు రాలిపోతున్నాయి.
కొన్ని చోట్ల చెట్లకు కాయలు ఉన్నా.. వాటి పరిమాణం చాలా చిన్నగా ఉంటోంది. ఉదాహరణకు సాధారణంగా ఒక మామిడికాయ బరువు 180 గ్రాముల నుంచి 220 గ్రాముల వరకు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం చెట్ల మీద కాయలు 70 గ్రాముల నుంచి 100 గ్రాములకు మించి ఉండడం లేదు. ప్రస్తుతం జిల్లాలో ఈదురుగాలులు, అకాల వర్షాల వంటివి లేకున్నా పిందెలు, కాయలు రాలిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
మ్యాంగో క్లస్టర్ కింద ఎంపిక
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద ఎంపిక చేసింది. దాదాపు రూ.165 కోట్లతో ఓ సీడ్స్ కంపెనీ ఈ పథకం అమలు బాధ్యతను తీసుకుంది. ఈ ఏడాది నుంచే స్కీమ్‌ను ఉమ్మడి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. స్కీమ్ కింద ఎంపికైన రైతులకు కొత్త మామిడితోటలపై పెట్టుబడి రాయితీ, పాత తోటల పునరుద్ధరణ, కొమ్మల కత్తిరింపులు, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం, పంట కోత అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన, పంట మార్కెటింగ్, బ్రాండింగ్ తదితర సదుపాయాలను కల్పించనున్నారు. కానీ స్కీమ్‌ను టేకప్ చేస్తున్న కంపెనీ ఈ విషయాల గురించి పట్టించుకోవడం లేదు.
ఇలా చేస్తే మేలు
మామిడి చెట్ల నుంచి పిందెలు, కాయలు రాలకుండా ఉండడానికి ప్లానోఫిక్స్ అనే హార్మోన్ 4.5 మిల్లీలీటర్లను 25 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు స్ర్పే చేయాలి. కాయ సైజు, నాణ్యత పెరగడానికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మామిడి కాయలు రాలకుండా తగ్గించవచ్చు. అలాగే డ్రిప్ ద్వారా గానీ, కాల్వల ద్వారా గానీ నీటిని అందించాలి. వారంలో ఒకసారైనా కాల్వలు కట్టుకొని నీటి తడులు అందించాలి.
వాతావరణంలో తేమ తగ్గింది
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో నీటి లభ్యత తగ్గిపోయింది. వాతావరణంలో తేమ శాతం తగ్గి మామిడి తోటల్లో పిందే, కాయలు రాలిపోతున్నాయి. నీటిని సరిగా ఇవ్వకపోవడం వల్ల కూడా పిందె రాలిపోతుంది. ప్రతి మామిడి మొక్కకు నాలుగు నుంచి ఐదు డ్రిప్‌లు ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా ప్రతి రోజూ మూడు గంటలు నీటి తడి ఇవ్వాలి. డ్రిప్ లేని వారు కాల్వలను తీసి నీటిని పారించుకోవాలి.
- కె.వేణుగోపాల్, హార్టికల్చర్ ఆఫీసర్, మహబూబ్‌నగర్-
జిల్లా మినీక్లస్టర్లు మామిడి తోటలు (ఎకరాల్లో..)
నాగర్‌కర్నూల్ 32 24,850
వనపర్తి 12 10,500
మహబూబ్‌నగర్ 08 8,829
గద్వాల 05 5,648
నారాయణపేట 04 3,085