అప్పుల్లో చల్‌‌‌‌గల్​ మ్యాంగో మార్కెట్‌‌‌‌ 

  • మార్కెట్​ అభివృద్ధికి ఇప్పటికే రూ.5.20 కోట్ల అప్పు
  • ఏటా రూ.200 కోట్ల లావాదేవీలు
  • తూతూమంత్రంగా మార్కెట్ ఫీజు
  • కాయల విలువ కాకుండా, వెహికిల్ కు ఇంతని వసూలు చేస్తున్న వైనం
  • ఏటా రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న మార్కెట్

జగిత్యాల, వెలుగు: తెలంగాణలో పెద్ద మామిడి మార్కెట్‌‌‌‌లో ఒకటైన జగిత్యాల జిల్లా చల్‌‌‌‌గల్​ మార్కెట్‌‌‌‌ అప్పుల్లో కూరుకుపోతోంది. ఏ చిన్న అభివృద్ధి పని చేయాలన్నా  అప్పులు చేయాల్సిన పరిస్థితి. మామిడి మార్కెట్​లో షెడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.5.20 కోట్లు అప్పు చేశారు. మార్కెట్‌‌‌‌లో ఏటా రూ.200కోట్ల వ్యాపారం జరుగుతున్నా మార్కెట్‌‌‌‌కు వచ్చే ఆదాయం పెరగడం లేదు. మార్కెట్​కమిటీ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యంతో మార్కెట్‌‌‌‌కు ఏటా రూ.లక్షల్లో ఆదాయానికి గండిపడుతోంది. కమీషన్ ఏజెంట్ల వద్ద తూతూమంత్రంగా మార్కెట్ ఫీజు వసూలు చేస్తుండటంతోనే ఆదాయం కోసుకుపోతోందన్న ఆరోపణలున్నాయి.  

కాయ రేటు పెరిగినా.. ఆమ్దానీ పెరగడం లేదు

మార్కెట్ 2005లో ప్రారంభం కాగా అప్పటి నుంచి దాదాపు రూ.60లక్షల ఆదాయమే వస్తోంది. కొన్నేండ్లుగా టన్నుకు సుమారు రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. ఒక్కో లారీలో15 టన్నులకు రూ.30 వేల చొప్పున రూ.4.50 లక్షల విలువ ఉంటుంది. ఈ మేరకు వ్యాపారులు ఒక శాతం మార్కెట్ ఫీజు అంటే లారీకి రూ.4,500 మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు. కాయ రేటు పెరిగితే దాని ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉండగా, అలా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కమీషన్ ఏజెంట్లు ఎక్కువ రేటుకు కొన్నా.. తక్కువ రేటుకు కొన్నామని చెబుతూ మార్కెట్​ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నారు. దీంతో మార్కెట్‌‌‌‌ ఆదాయానికి కోతపడుతోంది. 

90 మందికి పైగా కమీషన్ ఏజెంట్లు

మ్యాంగో మార్కెట్‌‌‌‌లో ఏటా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుండగా, సుమారు 90 మంది కమీషన్ ఏజెంట్లు, 59 మంది అడ్తిదారులు ఉన్నారు. సీజన్‌‌‌‌లో ఇక్కడి నుంచి మామిడిని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, నాగ్‌‌‌‌పూర్​వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. గతేడాది మార్కెట్ ఫీజు రూ.59.48 లక్షలు మాత్రమే వసూలైంది. 2018-–19 లో రూ.71.89 లక్షలు, 2019--20 లో రూ. 64.01 లక్షలు, 2020-–21లో రూ.69.65 లక్షలు, 2021–-22లో రూ.91.70 లక్షలు ఫీజు వసూలైంది.  నిబంధనల ప్రకారం ఫీజు వసూలు  చేస్తే ఏటా మార్కెట్​ఆదాయం రూ.కోటికిపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అప్పులతోనే అభివృద్ధి పనులు 

2005 లో ఏర్పాటైన చల్‌‌‌‌గల్​ మ్యాంగో మార్కెట్ కోసం గతేడాది మరో 10 ఎకరాలు కేటాయించారు.  ఇందులో దాదాపు రూ.7 కోట్లతో వ్యాపారులకు షెడ్లు నిర్మించి ఇచ్చారు. నామమాత్రపు ఫీజు వసూళ్లతో వస్తున్న ఆదాయం మార్కెట్ నిర్వహణకు సరిపోకపోవడంతో మార్కెట్ అప్పులపాలవుతోంది. మామిడి మార్కెట్లో షెడ్ల నిర్మాణానికి ఇతర మార్కెట్లయిన మేడ్చల్, ములుగు, నర్సంపేట, కథలాపూర్, లక్సెట్టిపేట మార్కెట్ల నుంచి రూ. 5.20 కోట్లు అప్పు తీసుకువచ్చారు. కోట్లలో 
వ్యాపారం సాగుతున్నా అప్పులు చెల్లించడం కష్టంగా మారింది.  

ఏటా పెరుగుతున్న మెయింటనెన్స్​

మార్కెట్‌‌‌‌లో సిబ్బంది జీతభత్యాలు, లేబర్​కూలీలు, మెయింటనెన్స్, కరెంట్ ​బిల్లుల ​కోసం ఏటా ఖర్చు పెరుగుతోంది. ఇలా దాదాపు రూ.10లక్షల వరకు ఖర్చవుతోంది. ఈసారి మార్కెట్‌‌‌‌లోనే బిజినెస్ చేయాలని ఆదేశించడంతో  కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కమిటీ షెడ్లలోనే కొనుగోళ్లు చేపడుతున్నారు. దీంతో ఈ సీజన్​లో  మెయింటనెన్స్​ కోసం సుమారు రూ.20లక్షల దాకా ఖర్చు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

రూల్స్​ ప్రకారమేవసూల్ ​చేస్తున్నాం

మామిడి మార్కెట్‌‌‌‌లో రూల్స్​ ప్రకారమే మార్కెట్​ఫీజు వసూల్​చేస్తున్నాం. అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి కచ్చితమైన ధర కోసం రశీదులు ఇస్తున్నాం. వే బ్రిడ్జి బిల్లుల ప్రకారం ఫీజు తీసుకుంటున్నాం. ఎక్కడ అవకతవకలు జరిగే అవకాశం లేదు. మార్కెట్ కమిటీకి సిబ్బంది ప్రతి వ్యాపారి కొనుగోళ్లను పరిశీలిస్తుంటారు.  ఈసారి మామిడి ధర ఎక్కువ లేకపోవడంతో మార్కెట్‌‌‌‌కు లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

–రాజ శేఖర్, సెక్రటరీ, మార్కెట్ కమిటీ