
- ఇద్దరు ట్రేడర్లకు లైసెన్సులు ఇచ్చిన అధికారులు
- టన్నుకు రూ.50 వేల చొప్పున ధర చెల్లింపు
- గతంలో నాగపూర్ మార్కెట్లో అమ్మకాలు
- అక్కడ కమీషన్ ఏజెంట్ల దోపిడీతో భారీగా నష్టపోయిన రైతులు.. యార్డు ఏర్పాటుతో హర్షం
మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మామిడి రైతుల కష్టాలు తీరాయి. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్యార్డ్ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యాంగో మార్కెట్‌ను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం ప్రారంభించారు. మామిడికాయల కొనుగోలుకు ప్రస్తుతం ఇద్దరు ట్రేడర్లు ముందుకు రాగా.. వారికి మార్కెటింగ్ శాఖ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మరికొందరు ట్రేడర్లను బెల్లంపల్లికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల కాలంగా కలగా మిగిలిన మ్యాంగో మార్కెట్ఎట్టకేలకు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పదేండ్ల ఎదురుచూపులు
జిల్లాలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ఎన్నో ఏండ్లుగా డిమాండ్ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో 2015లో అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు రూ.1.70 కోట్లతో మ్యాంగో మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. రూ.1.16 కోట్లతో వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని ఖాళీ జాగాలో రెండు కవర్ షెడ్లు, కాంపౌండ్ నిర్మించి వదిలేశారు. ఆ తర్వాత మరో రూ.44 లక్షలు రిలీజ్ చేయడంతో సీసీ రోడ్డు, ఆర్వో ప్లాంట్ నిర్మించారు.
కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గడ్డం వినోద్ మామిడి రైతుల కష్టాలు తీర్చడంపై దృష్టిపెట్టారు. ఆయనఆదేశాలతో సంబంధిత అధికారులు నిరుడు మామిడి కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రయత్నాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ట్రేడర్లు, కమీషన్ఏజెంట్లను పిలిపించారు. కానీ మార్కెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ట్రేడర్లు లైసెన్సులు తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఎలాగైనా ఈ సీజన్లో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రైతుల కల ఫలించింది.
తీరిన కష్టాలు.. తప్పిన దోపిడీ
జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేవారు. దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపూర్ వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడేవారు. ట్రాన్స్‌పోర్టు చార్జీలు రైతులకు తడిసి మోపెడయ్యేవి. తీరా అక్కడికి వెళ్లాక ట్రేడర్లు, కమీషన్ఏజెంట్లు రేట్లు తగ్గించి క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ.5వేల లోపే చెల్లించి రైతులను నిలువునా దోచుకునేవారు. కష్టపడి పండించిన పంటకు అక్కడ గిట్టుబాటు రేటు దక్కేది కాదు. ఫలితంగా కొన్నిసార్లు రైతులు పెట్టుబడులు సైతం నష్టపోయిన సందర్భాలు న్నాయి. ఇప్పుడు బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ఓపెన్ కావడంతో రైతుల కష్టాలు తీరాయి. ట్రేడర్లు, కమీషన్ఏజెంట్ల దోపిడీ తప్పింది. ఒక్కో రైతుకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదా కానున్నాయి. నాగపూర్‌లో టన్నుకు రూ.30 వేలు పలికేది. కానీ బెల్లంపల్లి మార్కెట్లో ట్రేడర్లు టన్నుకు రూ.50 వేలు అంటే క్వింటాలుకు రూ.5వేల చొప్పున చెల్లించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుంచి వేలంపాట జరుగుతుంది.
18వేల ఎకరాల్లో తోటలు
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా దాదాపు 18,500 ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి. ఈసారి 14,500 ఎకరాల్లో మాత్రమే కాత వచ్చింది. సాధారణంగా ఎకరాకు సగటున ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి వాతావరణం అనుకూలించకపోవడంతో సరిగా పూత రాలేదు, వచ్చిన పూత నిలువ లేదు. దీనికితోడు గత నెలలో కురిసిన వడగండ్ల వానకు 4వేల ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం జరిగింది. ఫలితంగా ఈసారి 40 నుంచి 50 శాతం మాత్రమే కాత వచ్చింది. దీంతో ఎకరానికి మూడు, నాలుగు టన్నులకు మించి చేతికొచ్చే పరిస్థితి లేదు.
కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తాం
జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి తోటలు సాగవుతున్నా... మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి కష్టాలు తీర్చాలని కంకణం కట్టుకొని ఎట్టకేలకు నా చేతుల మీదుగా మ్యాంగో మార్కెట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. రైతులు గిట్టుబాటు ధర వచ్చే వరకు మామిడి కాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ఏర్పాటు చేస్తాం. జిల్లాలో సాగును ప్రోత్సహిస్తాం.
గడ్డం వినోద్, ఎమ్మెల్యే