
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. సమ్మర్లో మామిడి పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మార్కెట్, రోడ్లపై ఎక్కడ చూసినా అనేక రకాల జాతుల మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. పండ్ల రారాజుగా పేరొందిన మామిడి విష తుల్యంగా మారుతోంది. గతంలో పండ్లను సహజంగా పండించి మార్కెట్‌కు తరలించేవారు. ఇప్పుడు మాత్రం మార్కెట్‌లోకి వచ్చే కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు.
నిషేధిత కాల్షియం కార్బైడ్, ఎథిలిన్ పౌడర్తో ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు విరివిగా వినియోగిస్తున్నారు. వీటి వినియోగం వలన ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాక్ చేసిన ఎథెఫాన్ పౌడర్ ప్యాకెట్లను నీటి బకెట్లలో ముంచి.. తర్వాత ఆ ప్యాకెట్లను కాయల బాక్స్లో వేసి పేపర్లు చుట్టి ప్యాకింగ్ చేస్తుంటారు. నీళ్లు తాకగానే ఎథిలిన్ పౌడర్లో నుంచి వాయువులు వెలువడతాయి. ఆ వాయువులతో కాయలకు యెల్లో కలర్ వచ్చి పండ్లుగా మారుతాయి.
ఎథిలిన్ మొక్కల పెరుగుదలకు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి కెమికల్ను మామిడి కాయలను మగ్గపెట్టడానికి వాడుతుండటంతో ఆ పండ్లను తింటే కంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్, నాడీ వ్యవస్థ దెబ్బతింటాయని అంటున్నారు. చిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు.
సహజ సిద్ధంగా పండే పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లాంటి పోషకాలు ఉంటాయని, కృత్రిమంగా పండించే పండ్లలో పోషకాలు లభించకపోగా అనారోగ్యం కలిగిస్తాయని అంటున్నారు. కాయ పండుగా మారడానికి ఐదారు రోజులు పడుతుంది. కానీ ఈ పౌడర్తో 24 గంటల్లోనే మామిడి కాయ పండి, నిగనిగలాడే యెల్లో రంగులోకి మారిపోతుంది. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొందరు వ్యాపారులు లాభం కోసం ఇలా చేస్తున్నారు.