మహబూబ్ నగర్: అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. మహబూబర్ నగర్ జిల్లాలో రాహుల్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం మాణిక్కం ఠాగూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 14 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం పూట రాహుల్ ప్రజలతో మమేకమవుతారని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే రాహుల్ ఈ యాత్ర చేపట్టారని, యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మోడీ ప్రభుత్వ కార్పొరేటీకరణ, నిరుద్యోగ సమస్యే ఎజెండాగా రాహుల్ యాత్ర సాగుతోందన్నారు. ప్రజా ప్రయోజనాలే తప్పా.. పార్టీ ప్రయోజనం కోసం రాహుల్ పాదయాత్ర చేయడంలేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రాహుల్ యాత్రలో భాగస్వాములు కావాలని మాణిక్కం ఠాగూర్ కోరారు.