- ఐదు పంచాయతీల విలీనం, బయ్యారం ఉక్కుపరిశ్రమ, మేడారం జాతరకు జాతీయహోదా
భద్రాచలం, వెలుగు : లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మహబూబ్బాద్ నియోజకవర్గంలో ఆశలు రేకెత్తిస్తోంది. ఏళ్లనాటి సమస్యల పరిష్కారానికి తమది హామీ అంటూ ప్రకటించిన తీరు ఊపు తెచ్చింది. పదేళ్లుగా భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలు గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, పిచ్చుకులపాడులను తిరిగి తెలంగాణలో కలిపి తీరుతామని, విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, మేడారం జాతరకు జాతీయహోదా ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడంపై మహబూబ్బాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విభజన సమస్యలతో భద్రాద్రి విలవిల
2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా పోలవరం ఆర్డినెన్స్ పేరుతో ఏడు పంచాయతీలను భద్రాచలం నియోజకవర్గం నుంచి ఆంధ్రాలో విలీనం చేశారు. ఈ విభజన చట్టం ఆలయ ఆధారిత పర్యాటక కేంద్రం భద్రాచలానికి శాపంగా మారింది. భద్రాచలం టౌన్ చుట్టూ ఆంధ్రా ప్రాంతమే. కనీసం డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేని దుస్థితి. ఏడు మండలాలు తీసుకున్నారు సరే.. కనీసం భద్రాచలం అభివృద్ధికి ఐదు పంచాయతీలైనా తిరిగి ఇవ్వండంటూ దశాబ్దకాలంగా ఈ ప్రాంత ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే ఆంధ్రాలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు పంచాయతీల మీదుగా పోవాల్సి వస్తోంది. గుండాల, పురుషోత్తమపట్నంలతో కలిపి మొత్తం ఐదు పంచాయతీల్లో దేవస్థానం భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. వరదల సమయంలో ఈ ఐదు పంచాయతీలకు సాయం అందించే దిక్కులేదు. ఇవి ఏపీలో ఉన్నప్పటికీ భద్రాచలంకు అంతర్భాగంగానే ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామంటూ ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొనడంతో భద్రాచలం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యువతకు ఉపాధి
బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం మహబూబ్బాద్ నియోజకవర్గంలోని యువత ఏళ్ల తరబడి ఎదురుచూస్తోంది. ఉన్నత విద్య చదివిన గిరిజన, గిరిజనేతర యువకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. ఈ పరిశ్రమ ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధి శరవేగం అవుతుంది.
దశాబ్దాలుగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై హామీల వర్షం కురిపిస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత మరిచిపోతున్నాయి. కానీ ఈసారి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చడంతో ఆశలు సజీవంగా నిలిచాయి. మేడారం ఆదివాసీ జాతరకు జాతీయహోదా ప్రకటిస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మూడు ప్రధాన అంశాలు మహబూబ్బాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు తెచ్చి పెట్టనున్నాయి.