గండిపేట్, వెలుగు: మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ టౌన్ షిప్‌లో హైడ్రా చర్యలకు దిగింది. అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షట్టర్లను మున్సిపల్ అధికారులు గురువారం తొలగించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని గ్రౌండ్ ప్లోర్‌ను వ్యాపార సముదాయాలుగా మార్చుతున్నారని ఇటీవల పలువురు నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
దీంతో మున్సిపల్ అధికారులతో కలిసి రెండు వారాల కింద హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెసిడెన్షియల్ అనుమతి పొందిన భవనంలో కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో మణికొండ మున్సిపల్ అధికారులు అపార్ట్‌మెంట్ నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో షట్టర్లు తొలగించాలని అందులో పేర్కొన్నారు. స్పందించకపోవడంతో హైడ్రా సమక్షంలో గురువారం షట్టర్లను తొలగించారు.