హైదరాబాద్, వెలుగు: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్స్టేట్ ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. పొత్తులపై కామెం ట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. బుధవారం ఉదయం హైదరాబాద్హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి చేసిన కామెంట్లపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. వరంగల్‌లో రాహుల్ మాట్లాడిన వీడియోను కోమటిరెడ్డికి ఠాక్రే చూపించినట్టు తెలిపాయి. హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కోమటిరెడ్డికి ఆయన తేల్చి చెప్పారని పేర్కొన్నాయి. ఇలాంటి కామెంట్లపై ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడించాయి. ఈ ఇష్యూపై హైకమాండ్ కు ఠాక్రే రిపోర్టు కూడా ఇవ్వనున్నట్టు తెలిపాయి.
సింగిల్ గా అధికారంలోకి వస్తం: ఠాక్రే
కోమటిరెడ్డితో భేటీ తర్వాత హాత్‌సే హాత్‌జోడో యాత్రపై పార్టీ నేతలతో ఠాక్రే రివ్యూ నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులుండవని ఠాక్రే స్పష్టం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామని, సింగిల్‌గా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వాపస్ తీసుకున్నారు. పార్టీ నేతలంతా రాహుల్‌గాంధీ చెప్పిన లైన్ ప్రకారమే నడుచుకోవాలి” అని సూచించారు. అందరూ అదే లైన్లో ఉన్నారని, త్వరలోనే పార్టీ నేతలంతా పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. కాగా, హాత్ సే హాత్ జోడో యాత్రను రాష్ట్రమంతటా విస్తరించే అంశంపై దాదాపు 8 గంటల పాటు ఠాక్రే రివ్యూ చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, హాత్‌సే హాత్‌జోడో ఇన్చార్జ్ గిరీశ్చోడోంకర్ తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటది: బోసురాజు
కోమటిరెడ్డి తన కామెంట్ల మీద ఇప్పటికే వివరణ ఇచ్చారని ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు చెప్పా రు. ఆయన వ్యాఖ్యల్లో తప్పుంటే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఠాక్రేతో మీటింగ్‌లో జోడో యాత్ర గురించే చర్చించామని పేర్కొన్నారు. భువనగిరి సెగ్మెంట్లో జరిగే యాత్రలో కోమటిరెడ్డి పాల్గొంటారని చెప్పారు. కాగా, ఠాక్రేతో కోమటిరెడ్డి ఏం చర్చించారన్న విషయం తనకు తెలియదన్నారు. ఠాక్రే నిర్ణయం మేరకే నడుచుకుంటామని మహేశ్కుమార్గౌడ్తెలిపారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలన్నారు. ‘‘కోమటిరెడ్డి ఏం చిన్న పిల్లాడు కాదు. అన్నీ తెలి సిన వాడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వ్యాఖ్యలు చేసే ముందు వాటి వల్ల కలిగే నష్టాలంటే ఆలోచించుకుంటే బాగుండేది” అని అన్నారు.
చాణక్య సర్వే వివరాలే చెప్పాను: కోమటిరెడ్డి
తన కామెంట్లను మీడియా వక్రీకరించిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఠాక్రేతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాణక్య సర్వేలో వచ్చిన విషయాలనే నేను చెప్పాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై నేను చేసిన కామెంట్ల మీద ఠాక్రేతో చర్చ జరగలేదు. ఎన్నికలకు ముందే పార్టీ నేతలకు టికెట్లు ఇచ్చే విషయంపైనే చర్చించాం. ఐదారు నెలల ముందే నేతలకు టికెట్లు ఇవ్వాలని చెప్పాను. పోయినసారి టికెట్లు ఇచ్చేందుకు అనవసరంగా గోల్కొండ హోటల్లో సమావేశాలు పెట్టి సమయాన్ని వృథా చేశారు. అప్పుడు టీడీపీతో పొత్తు వద్దని చెప్పినా పట్టించుకోలేదు. దాంతో నష్టం జరిగిందని ఠాక్రేకు వివరించాను” అని పేర్కొన్నారు. అయితే తాను చేసిన కామెంట్లపై ఠాక్రేతో చర్చించలేదని కోమటిరెడ్డి చెప్పగా.. తన కామెంట్లను కోమటిరెడ్డి వాపస్తీసుకున్నారని ఠాక్రే చెప్పడం గమనార్హం.