మణిపూర్లో భీకర ఎన్కౌంటర్.. 11 మంది కుకీ తిరుగుబాటుదారుల హతం

మణిపూర్లో భీకర ఎన్కౌంటర్.. 11 మంది కుకీ తిరుగుబాటుదారుల హతం

జిరిబమ్ జిల్లా: మణిపూర్లో సోమవారం(నవంబర్ 11, 2024) భీకర ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు మధ్య జరిగిన కాల్పుల్లో 11 మంది తిరుగుబాటుదారులు మృతి చెందారు. మణిపూర్లోని జిరిబమ్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో కొందరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) జవాన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

అస్సోం-మణిపూర్ సరిహద్దులో జిరిబమ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సీఆర్పీఎఫ్ పోస్ట్ దగ్గర గస్తీ కాస్తున్న భద్రతా బలగాలపై ఈ అనుమానిత కుకీ మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. రెండు వైపుల నుంచి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగినట్లు తెలిసింది. ఇవాళ తెల్లవారుజామున కూడా మణిపూర్లోని  తూర్పు ఇంఫాల్ జిల్లాలో కాల్పులు జరిగాయి.

ALSO READ | అంత కసి ఏంట్రా: ఓ మనిషిని ఏడు ముక్కలుగా నరికి.. బ్యాగులో పెట్టి.. బీచ్‎లో పడేసి..

సమీపంలోని కొండ పై నుంచి ఓపెన్ ఫైర్ చేయడంతో పొలంలో పనిచేసుకుంటున్న ఒక రైతు గాయపడ్డాడు. ఇలా గడచిన మూడు రోజుల నుంచి రైతులపై కాల్పులు జరపడంతో పొలాల్లో పనులకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. తూర్పు ఇంఫాల్ జిల్లాలో తుపాకీ తూటాలే కాదు బాంబుల మోత కూడా మోగుతుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

కుకీలు ఎవరు?
ఇండియాలోని అనేక కొండ జాతి తెగల్లో కుకీలు ఒకటి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, మేఘాలయ, అస్సాం, త్రిపుర, నాగాలాండ్​లో నివసిస్తారు. కుకీలు ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తుండగా.. మణిపూర్లోని చురాచంద్​పూర్ వారికి బలమైన కోట. రాష్ట్ర జనాభాలో 40% ఉన్నారు. వీరిలో మళ్లీ 20 ఉప తెగలున్నాయి. చాలా ఏండ్ల కింద కుకీ తెగకు చెందినవాళ్లు క్రైస్తవ మతంలోకి మారారు. కొండ ప్రాంతాల్లో వీళ్లు ఉండొచ్చు. కానీ, ఆ స్థలాలు అమ్మడానికి లేదు.