Manipur : మణిపూర్ మారణహోమం ఇంకెన్నాళ్లు?

Manipur : మణిపూర్ మారణహోమం ఇంకెన్నాళ్లు?

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌‌‌లో మైతీ, కుకి జాతుల మధ్య మళ్లీ హింస చెలరేగింది.‌‌‌‌ దాదాపు ఏడాదిన్నరగా రెండు జాతుల మధ్య రగిలిన హింసతో రాష్ట్రం నిత్యం నిరసనలు, అల్లర్లు, హత్యలతో అట్టుడుకుతోంది. మణిపూర్ హింసలో వందలాది మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులైనారు. ఇటీవల జిరిబాం జిల్లాలో మైతీ తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులను కుకి తెగకు చెందిన మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హతమార్చారు. వారి మృతదేహాలు అసోం, మణిపూర్ సరిహద్దుల్లోని జిరీ, బరాక్ నదులు కలిసే సంగమప్రదేశంలో లభ్యమయ్యాయి. దీంతో  కోపోద్రిక్తులైన  మైతీలు ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లపై హింసాకాండకు దిగారు.   పోలీసులు, ఆందోళనకారుల మధ్య  ఘర్షణలతో  మణిపూర్​ రక్తసిక్తమవుతోంది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మైతీల పక్షపాతిగా వ్యవహరించడంతో జాతుల మధ్య చెలరేగిన పరస్పర ఘర్షణలు,  మారణహోమాలకు దారితీస్తున్నాయి.

మణిపూర్‌‌‌‌  హింసపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  దేశంలోని  ఒక రాష్ట్రం జాతి వివక్షతతో  ఇలా తగలబడుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడకపోవడం, అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించకపోవడం  అత్యంత విచారకరం.  ఇంతటి ఘోరకలి  విపక్ష పాలిత రాష్ట్రంలో జరిగివుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకునేదా? శాంతి భద్రతలు క్షిణించాయన్న నెపంతో రాష్ట్రపతి పాలన విధించి, ఆ రాష్ట్రాన్ని కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకోగలిగే అవకాశాన్ని బీజేపీ జారవిడుచుకునేదా? అన్నది మౌలిక ప్రశ్న. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌‌‌‌పీపీ) అధినేత కార్నార్డ్ సంగ్మా ప్రకటించారంటే ఉద్రిక్త పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. 

ఎస్టీ హోదాపై  చెలరేగిన హింస

1949  అక్టోబర్‌‌‌‌ 15న భారత్‌‌‌‌లో అంతర్భాగమైన మణిపూర్‌‌‌‌ కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగింది. అనేక పోరాటాల ఫలితంగా 1972 జనవరి 21న రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో 30 వరకూ వివిధ కులాలు,షెడ్యూల్డ్ తెగలు ఉన్నా ప్రధానంగా మూడు తెగలు మైతీ, నాగా, కుకీలు మెజారిటీగా ఉన్నారు. మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కల్పించాలనే  డిమాండ్ చాలా ఏండ్ల నుంచి బలంగా ఉంది. 2012 నుంచి షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్ (ఎస్టీడీసీఎం) నేతృత్వంలో ఉన్న మైతీలకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ ఆధారంగా మణిపూర్ హైకోర్టు 2023 మార్చి 27న  మైతీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని    నాలుగు వారాల్లోగా ఆ    రాష్ట్ర  ప్రభుత్వం పరిశీలించి, కేంద్రానికి పంపాలని హైకోర్టు ఆదేశించడంతో  రాష్ట్రంలో  హింసాకాండ చెలరేగింది.

ఆందోళన చెందుతున్న కుకీ, నాగా తెగలు 

మణిపూర్‌‌‌‌లో 16 జిల్లాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లోయ ప్రాంతం జిల్లాలుగా, మరికొన్ని  కొండ ప్రాంతం జిల్లాలుగా  విభజించారు. అందులో ఇంపాల్ లోయ రాష్ట్రం మధ్యలో ఉంది. రాష్ట్రంలో ఉన్న 90 శాతం కొండ (హిల్ ఏరియా) ప్రాంతాల్లో దాదాపు 35 శాతం షెడ్యూల్డ్ తెగలు నివసిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో మైతీ కమ్యూనిటీ 64 శాతం పైగా ఉంది. 60 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్ర శాసనసభలో  40 మంది మైతీ కమ్యూనిటీకి చెందినవారే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు  కుకీ,  జోమీ,  నాగ వంటి ఇతర షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.  జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న  మైతీలు గిరిజన తెగలైన నాగా,  కుకీల కంటే విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మైతీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని కుకీ,  నాగా తెగల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు,  విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను జనాభాలో అత్యధికంగా ఉన్న మైతీలు సొంతం చేసుకుంటారని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే  మైతీలో కొన్ని సమూహాలకు షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా ఉంది. మండల్ కమిషన్  నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 (A) ప్రకారం 1992 నుంచి మైతీలు వెనుకబడిన తరగతులు (ఓబీసీ) రిజర్వేషన్లు పొందుతున్నారు.  ఇంతవరకూ ఓబీసీలుగా ఉన్న మైతీలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తే, తీవ్రంగా నష్టపోయేది  కుకీ,  నాగ, జోమీ  తెగలేనని ఆందోళన చెందుతున్నారు.  కాగా, జనాభాలో 60 శాతంగా ఉండి, మైదాన ప్రాంతానికి చెందిన మైతీలను బీజేపీ తన ప్రధాన ఓటు బ్యాంకుగా పరిగణించడం హింసకు ప్రధాన కారణం. 

శాంతిచర్చలతోనే  సమస్యకు పరిష్కారం  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడి  జాతి, మతం పేరుతో జరుగుతున్న విభజన రాజకీయాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి.  మైతీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశంపై కుకీ, నాగ, జోమీ తెగలకున్న అనుమానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివృత్తి చేయాలి. మణిపూర్ సంక్షోభాన్ని మానవతా సమస్యగా పరిగణించి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా కోర్టు పర్యవేక్షక ట్రిబ్యునల్‌‌‌‌ను ఏర్పాటు చేయాలి.  నేరాలకు పాల్పడిన వ్యక్తులను  క్రిమినల్ చట్టం ప్రకారం విచారించాలని వర్మ కమిషన్  సిఫార్సులను  అమలు చేయాలి. మణిపూర్  అంతర్యుద్ధం మరో లెవెల్​ కు వెళ్లకుండా ఆదిలోనే కేంద్రం అడ్డుకట్ట వేయాలి.  ఆందోళనకారులపై ఉక్కుపాదం, నిర్బంధాల ద్వారా కాకుండా శాంతియుత చర్చలు,  పరస్పర శాంతి ఒప్పందాలతోనే  సమస్యకు పరిష్కారం లభిస్తుంది..

ప్రధాని మోదీ మౌనం 

బీజేపీ ‘డబుల్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌’ సర్కారు పాలనలో మణిపూర్‌‌‌‌ తగలబడుతోంది. గత ఏడాది మే నుంచి మణిపూర్‌‌‌‌ మంటల్లో కాలి బూడిదవుతుంటే, దేశ ప్రధాని కనీసం ఒకసారైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించిన దాఖలాలు లేవు.  కానీ, అదే సమయంలో ఎన్నికల  ప్రచారానికి మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో పలుమార్లు పర్యటించారు.  అధికారమే పరమావధి అన్నట్టున్నది ప్రధాని వ్యవహరిస్తున్న తీరు.  ప్రధాని మోదీ  ప్రపంచమంతటా పర్యటిస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ శాంతి ప్రక్రియ కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని దేశంలో రగులుతున్న మణిపూర్ మారణ హోమాన్ని తగ్గించేలా చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదు.  ఇరువర్గాల మధ్య సామరస్యంగా శాంతి చర్చలు  జరపకపోవడం  దేనికి సంకేతం?

-  డా.చెట్టుపల్లి మల్లికార్జున్,
పొలిటికల్ ఎనలిస్ట్

  • Beta
Beta feature
  • Beta
Beta feature