- 2025 ఏడాది ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నా..
- అన్ని జాతులు కలిసికట్టుగా ఉండాలి..
- కొత్త జీవితం ప్రారంభించాలని పిలుపు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండు జాతుల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఏడాదంతా దురదృష్టకర పరిస్థితులతోనే గడిచిపోయిందని, ఇందుకు తాను చింతిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని వేడుకున్నారు. ఈ ఏడాదైనా ఆశాజనకంగా ఉంటుందని, 2025లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నానని చెప్పారు. న్యూ ఇయర్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా మంగళవారం బీరేన్‌సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఏడాది మొత్తం దురదృష్టకరంగానే గడిచింది. గత మే 3 నుంచి ఇప్పటివరకూ జరుగుతున్న దానికి నేను రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరుతున్నా. చాలామంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. 200 మందికి పైగా మృతిచెందారు. ఎంతో మంది తమ ఇండ్లను విడిచిపెట్టారు. ఇందుకు నేను చింతిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.
కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం
గత 3,4 నెలల నుంచి రాష్ట్రంలో శాంతి నెలకొనడాన్ని చూస్తున్నామని బీరేన్‌సింగ్ తెలిపారు. మణిపూర్ క్షేమం కోసం కేంద్రం తగిన భద్రతా సిబ్బందిని పంపిందని, నిర్వాసితుల కోసం నిధులు సమకూర్చిందని, త్వరలోనే ఇండ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. 2025 లో పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘రాష్ట్రంలోని అన్ని జాతుల ప్రజలకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగినదాన్ని మరిచిపోండి. పొరపాట్లను క్షమించండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మన జీవితాలను కొత్తగా ప్రారంభిద్దాం. అన్ని కమ్యూనిటీలు కలిసికట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని పేర్కొన్నారు.