బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్ కు సపోర్ట్ చేసి ఆయన గెలుపుకు కృషి చేస్తామని టీడీపీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ మణిరాంసింగ్, నియోజకవర్గ ఇన్చార్జి గద్దల నారాయణ వెల్లడించారు. బుధవారం పట్టణంలోని టీడీపీ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో నాయకులు గడ్డం వినోద్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజక వర్గం అభివృద్ధి చెందాలంటే అభ్యర్థి గడ్డం వినోద్ తోనే సాధ్యమవుతుందని అన్నారు.
బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు గెలిచిన దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి అభివద్ధిని పట్టించుకోలేదన్నారు. వినోద్ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తనకు మద్దతు తెలుపడం సంతోషంగా ఉందని, ప్రజలందరూ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వినోద్ వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, లీడర్లు దాసరి ప్రతాప్, జుమ్మిడి బానయ్య, దేవసాని ఆనంద్, జావేద్ ఖాన్, బోలు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అధికార ప్రతినిధిగా బత్తుల రవి
కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా మండలంలోని భూదాకుర్దు గ్రామానికి చెందిన బత్తుల రవి నియమితులయ్యారు. రవికి గడ్డం వినోద్ నియామకపు పత్రం అందజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రామచందర్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోచంపల్లి హరీశ్, పార్టీ బెల్లంపల్లి , నెన్నెల మండలాల అధ్యక్షులు సత్యనారాయణ, గట్టు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.