దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అక్కర్లేదని దేశంలోని కొందరు దేశ వ్యతిరేకులు మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. అంబేద్కర్ ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని కలలు కన్నారని, అయితే కొందరు దేశ వ్యతిరేకులు గత 75 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారని, దీంతో దేశంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని అన్నారు.
ఈ తప్పును సరిదిద్దడానికి దేవుడు మనీష్ సిసోడియా అనే వ్యక్తిని పంపాడని, అతను ఉదయం 6 గంటలకుతన పనిని ప్రారంభించి ఢిల్లీ పాఠశాలల చుట్టూ తిరిగేవాడన్నారు. అతను గత ఐదేళ్లలో విద్యలో చాలా మార్పలు చేశారని అన్నారు. కానీ కొన్ని దేశ వ్యతిరేక శక్తులు దేశం పురోగతిని కోరుకోవడం లేదని, దళిత విద్యార్థులు బాగా చదువుకోవడం ఇష్టం లేని వారంతా కలిసి సిసోడియాను జైలుకు పంపారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు దేశానికి శత్రువులని ఆయన ఆభిప్రాయపడ్డారు.
కొంతమందికి జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన కూడా నిలిచిపోయిందని, అయితే తాను ఒక నెలలో పథకాన్ని తిరిగి ప్రారంభిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఈ పథకం కింద నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తామన్నారు. భారతదేశం ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని, అయితే అంబేద్కర్ అందరికంటే ధీటైన వ్యక్తి అని ఢిల్లీ సీఎం అన్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు ఉంచాలని తాము నిర్ణయించామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే తాను గాంధీజీని మరిచిపోయానని చాలా మంది అంటున్నారు.. కానీ తాను గాంధీజీని చాలా గౌరవిస్తానని, ఆయన దేశం కోసం పోరాడారని, త్యాగాలు చేశారన్నారు, ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడార, కానీ తాను అంబేద్కర్‌ను ఎక్కువగా గౌరవిస్తానని కేజ్రీవాల్ చెప్పారు.