ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది

ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది
  • భారీ వర్షాలతో మెతుకుసీమ అతలాకుతలం
  • ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది
  • పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

మెదక్/పాపన్నపేట/రామాయంపేట/శివ్వంపేట/కౌడిపల్లి, వెలుగు : కుండపోతగా కురిసిన వానతో మెతుకుసీమ అతలాకుతలమైంది. ఇది వరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షంతో వరదలు పోటెత్తాయి. ప్రాణ, పంట నష్టం కలిగింది. మెదక్ జిల్లాలో గడచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 26.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సరాసరి 10.3 సెంటీ మీటర్లు, సిద్దిపేట జిల్లాలో సరాసరి 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 

మెదక్ పట్టణంలో నుంచి ఉన్న మహబూబ్ నహర్​ కాల్వ పొంగిపొర్లడంతో సాయినగర్​, వెంకట్రావ్ నగర్ కాలనీలు, ఆటోనగర్​లోని మెయిన్ రోడ్డులో భారీ వరద నీరు చేరి చెరువులా మారింది. దీంతో ఆయా కాలనీల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మెయిన్ రోడ్డులో వెహికల్స్​ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాంధీనగర్​ వీధిలో ఇళ్లలోని వరద నీరుచేరి, సామగ్రి, బట్టలు తడిసిపోయాయి. రామాయంపేట పట్టణంలో తహసీల్దార్ ఆఫీస్​ ఆవరణలో, గర్ల్స్​ హాస్టల్​ ప్రాంగణంలో భారీగా వరద నీరు చేరి ఇబ్బందులు ఎదురయ్యాయి. 

జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కొల్చారం,  హవేలిఘనపూర్​, పాపన్నపేట, చిన్నశంకరంపేట, చేగుంట, నిజాంపేట, టేక్మాల్​, కౌడిపల్లి, నర్సాపూర్​ మండలాల్లో దాదాపు 2,500 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నర్సాపూర్​, శివ్వంపేట, టేక్మాల్​, నిజాంపేట, కౌడిపల్లి మండలాల్లో సుమారు 400 ఎకరాలలో పత్తి పంట దెబ్బతింది. టేక్మాల్​, కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లో మరో వంద ఎకరాల వరకు ఇతర పంటలు నీట మునిగాయి.వాగులు పొంగిపొర్లడంతో మెదక్–రాయిన్​ పల్లి, చిన్నశంకరంపేట–జంగరాయి, హవేలి ఘనపూర్​  మండలం తిమ్మాయిపల్లి, చౌట్లపల్లి వెళ్లే దారిలో, మెదక్ మండలం పాతూర్​ పరిధిలోని గాజులవాయి తండా - మోటకాడి తండాల మధ్య, శివ్వంపేట - ఎదులాపూర్​ మధ్య రాకపోకలు స్తంభించాయి. హవేలిఘనపూర్​ మండలం గంగాపూర్ రూట్​లో బ్రిడ్జి తెగిపోయింది. పాపన్నపేట మండలం కొత్తపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. 

 

జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో 226 ఇండ్లు కూలిపోయాయి. ఇద్దరు చనిపోయారు. వెల్దుర్తి మండలం చర్లపల్లిలో మల్లారెడ్డి అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫాంలోకి భారీగా వరద నీరు చేరడంతో సుమారు వెయ్యి కోళ్లు చనిపోయాయి. ఘనపూర్​ ఆనకట్ట పొంగిపొర్లుతుండటంతో ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందు నుంచి నదీ పాయ పరవళ్లు తొక్కుతోంది. ఆలయ మండపంలోకి నీరు చేరింది.  ఆలయానికి రాకపోకలు బంద్ కావడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శనివారం మెదక్​ పట్టణంలో, హవేలి ఘనపూర్​, పాపన్నపేట, మెదక్​ మండలాల్లో,  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో పర్యటించి వరద పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా వరద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

సిద్దిపేట జిల్లాలో....

సిద్దిపేట, వెలుగు : జిల్లాలో కూడవెల్లి, మోయ తుమ్మెద, పెద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద కూడవెల్లి వాగును దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయారు. గజ్వేల్ ఏసీపీ రమేశ్​నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు. కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు లో లెవల్ బ్రిడ్జిపై నుంచి పొంగి పొర్లుతుండటంతో సిద్దిపేట–హన్మకొండల మధ్య రాకపోకలు నిలచిపోయాయి. నంగునూరు, మద్దూరు, చేర్యాల మండలాల గుండా సాగే పెద్ద వాగు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.  దౌల్తాబాద్ పీహెచ్​సీలో వరద నీరు నిలవడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవలు అందించడం కోసం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, వరద ముప్పు ఉన్న గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆఫీసర్లను సీపీ  ఆదేశించారు. 

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి, వెలుగు : జిల్లాలోని జిన్నారం, సంగారెడ్డి, అమీన్ పూర్, పటాన్ చెరు, నారాయణఖేడ్, సిర్గాపూర్ నాగలిగిద్ద, కల్హేర్, కాంగ్టి, న్యాల్కల్ మండలాల్లో భారీగా వర్షం కురిసింది.  మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో రెండు లో లెవల్ బ్రిడ్జీలు మునిగిపోయాయి. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని పలుచోట్ల రోడ్లు తెగిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద ఉధృతి బాగా పెరిగింది. 29.917 టీఎంసీల సామర్థ్యం గల సింగూరులో ప్రస్తుతం 28.776 టీఎంసీలకు పెరగడంతో అధికారులు శనివారం 9, 10, 11 నంబర్ల మూడు  గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులోకి 34890 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, ఇన్ ఫ్లో ద్వారా వచ్చిన 34890 క్యూసెక్కుల నీటిని వచ్చినట్టే బయటికి వదులుతున్నారు. కలెక్టర్ డాక్టర్ శరత్, అందోల్​ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ ప్రాజెక్టును  వేర్వేరుగా సందర్శించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆందోళన చెందొద్దు.. అండగా ఉంటాం
రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు : అమీన్​పూర్​ మండలంలోని గండిగూడెం, బొల్లారం మున్సిపల్ పరిధిలోనీ వివిధ కాలనీల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం ఉదయం పర్యటించారు. బాధితులు ఆందోళన  చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వరద ముంపు గురైన కాలనీవాసులకు సమీపంలోని ప్రభుత్వ భవనంలో ఆశ్రయం కల్పించడంతో పాటు భోజన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.   అనంతరం డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీలలో రూ.89 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. 

అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​

మెదక్​ టౌన్, వెలుగు : సింగూరు నుంచి ఏడుపాయల మీదుగా మెదక్​ జిల్లాకు వచ్చే వరద నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసు శాఖ అవసరమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని మెదక్ కలెక్టర్​ హరీశ్​ సూచించారు. శనివారం పాపన్నపేట మండలంలోని ఏడుపాయలకు వెళ్లిన కలెక్టర్​ వరద ఉధృతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అంతకుముందు ఆయన వనదుర్గామాతకు రాజగోపురం వద్ద దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి పర్యటించారు. ఇండ్లు కూలిన బాధితులకు తక్షణ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను, పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.