- వృద్ధాప్య సమస్యలతో 92వ ఏట కన్నుమూసిన మాజీ ప్రధాని
- ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస
- ఆర్థిక సంస్కరణలతో ఎకానమీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త
- దేశ ఆర్థిక చరిత్రనే మలుపు తిప్పిన నాయకుడు
- పీవీ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్‌గా కీలక పాత్ర
- రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు
- 7 రోజులు సంతాప దినాలు.. రాష్ట్రంలో నేడు సెలవు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏండ్లు. మన్మోహన్ సింగ్ కొన్ని నెలలుగా వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ‘‘వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గురువారం ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు.
రాత్రి 8.06 గంటలకు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకువచ్చారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. రాత్రి 9.51 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు” అని ఎయిమ్స్ ఆస్పత్రి బులెటిన్ లో వెల్లడించింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుచరణ్ సింగ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఎకానమీని పరుగులు పెట్టించిన నాయకుడిగా, హుందాతో కూడిన రాజకీయాలు చేసి ఉత్తమ రాజనీతిజ్ఞుడిగా ఖ్యాతి పొందారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా పని చేసిన ఆయన నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత పదేండ్లపాటు ప్రధాని పదవి నిర్వహించిన మూడో నేతగా నిలిచారు. వయసు రీత్యా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొన్నేండ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో తన కుమార్తె పుస్తకావిష్కరణ సందర్భంగా మాత్రమే ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ లో పూర్తయింది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ప్రొఫెసర్ గా పని చేశారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ఎకనమిక అడ్వైజర్ గా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా దేశానికి సుదీర్ఘ కాలం ప్రయోజనకరమైన ఆర్థిక వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్ గా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా, ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎనలేని సేవలు అందించారు.
ఎయిమ్స్ కు తరలివచ్చిన నేతలు..
మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, ఆమె బిడ్డ ప్రియాంక గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఇతర ప్రముఖ నేతలు పలువురు హుటాహుటిన ఎయిమ్స్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ చీఫ్మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ఇతర అగ్ర నేతలు గురువారం కర్నాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ మీటింగ్ కు హాజరయ్యారు. మన్మోహన్ మరణ వార్త తెలియగానే వారంతా ఢిల్లీకి బయలుదేరారు.
ఏడు రోజులు సంతాప దినాలు
మన్మోహన్ సింగ్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించనున్నట్టు గురువారం రాత్రి అధికారిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం కేంద్ర కేబినెట్ ఈ మేరకు సమావేశమై సంతాప దినాలు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపాయి. కేబినెట్ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసులపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజులపాటు సంతాప దినాలను పాటించనుంది. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నది. కాంగ్రెస్ ఆఫీసులపై పార్టీ జెండాను కూడా అవనతం చేయనుంది.
దేశ ఆర్థిక చరిత్రకే మలుపు..
దేశ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వెనక అసలైన ఆర్కిటెక్ట్ గా మన్మోహన్ సింగ్ పేరు పొందారు. పీవీ సర్కారులో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన విశేష సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితులు కావడం దేశ ఆర్థిక చరిత్రకే ఒక మలుపుగా నిపుణులు అభిర్ణిస్తుంటారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రుణాల చెల్లింపులు, ఫారిన్ రిజర్వ్ లను బ్యాలెన్స్ చేస్తూ పరిస్థితిని గాడిలో పెట్టారు. ఎకానమీని పరుగులు పెట్టించేందుకు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.
ఇందులో భాగంగా ప్రైవేటైజేషన్ ను ప్రోత్సహించారు. భారత్ ను గ్లోబల్ మార్కెట్ల చెంతకు చేర్చారు. ఇలా దేశం దివాలా తీసే పరిస్థితి నుంచి ఆయన గట్టెక్కించారని, భారత దేశ ఆర్థిక గమనాన్నే ఆయన మలుపు తిప్పారని విశ్లేషకులు చెప్తుంటారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకూ రెండు సార్లు ప్రధానిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి సంకీర్ణ సర్కారుకు మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు. ప్రధానిగా మన్మోహన్ హయాంలో దేశం ఆర్థికంగా అనూహ్య వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలబెట్టింది.
అమెరికాతో న్యూక్లియర్ డీల్
అమెరికాతో దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న అణు ఒప్పందం ఖరారు కావడం మన్మోహన్ ప్రభుత్వం సాధించిన మరో ఘనతగా నిలిచింది. 123 అగ్రిమెంట్ గా పిలిచే ‘యూఎస్–ఇండియా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్’పై నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం పౌర, మిలిటరీ అణు కేంద్రాలను వేర్వేరుగా నిర్వహించేందుకు, పౌర అణు కేంద్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తనిఖీలు చేసేందుకు భారత్ అంగీకరించింది. దీంతో భారత్ కు అణు ఇంధన రంగంలో పూర్తి సహకారం అందించేందుకు అమెరికా ఒప్పుకుంది.
ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు దాకా..
చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడుపోసుకుంది. అలాగే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్ పాల్, లోకాయుక్త చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డు, వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది.
మన్మోహన్ చూడటానికి ఎంతో సౌమ్యంగా కనిపించేవారు. కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వాడిగా ఉండేవి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణా వైఫల్యమని ఆయన ఘాటుగా విమర్శించేవారు.
అలాగే జీఎస్టీ విధానం ఎకానమీకి తగిలిన అతిపెద్ద దెబ్బ అని తప్పుపట్టేవారు.
తెలంగాణ కల సాకారం..
ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. 2009లో అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు, ప్రధాని మన్మోహన్ సర్కారు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ఆమోదించి, దశాబ్దాల కలను నెరవేర్చింది.
ఎకనామిక్స్ ప్రొఫెసర్ నుంచి ప్రధాని పీఠం దాకా..
మన్మోహన్ సింగ్ 1963- నుంచి 1971 మధ్య తాను చదివిన పంజాబ్ వర్సిటీతోపాటు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.1971లో వాణిజ్య శాఖలో ఎకనామిక్ అడ్వైజర్‌గా చేరారు. 1972లో ఆయనకు ప్రమోషన్ వచ్చింది. దాంతో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తర్వాత యూఎన్సీటీఏడీ సెక్రటేరియెట్‌లో పనిచేశారు. అనంతరం 1982-- 85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు.
ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వహించారు.1991-–96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1998-–2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2004 మే 22న ప్రధాని పీఠాన్ని అధిష్టించి తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు క్రియేట్ చేశారు. మళ్లీ 2009 మే22న రెండోసారి దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 2014 వరకు ప్రధానిగా సేవలందించారు.
అవార్డులు
మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1987లో ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. మన్మోహన్ ను 2010లో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు.అంతేగాక, ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్ కు చోటు దక్కింది.
వీల్ చెయిర్ పై రాజ్యసభకు వచ్చి ఓటేశారు
ప్రజాస్వామ్య వ్యవస్థపై మన్మోహన్ సింగ్ కు ఉన్న నిబద్ధతను చాటే ఘటన ఇది. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియంత్రణ కోసం మోదీ సర్కారు తెచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై నిరుడు ఆగస్టు 7న రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. మన్మోహన్ కు అప్పుడు 90 ఏండ్లు. పైగా వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన వీల్ చైర్ కు పరిమితం అయ్యారు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన రాజ్యసభకు వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయన చర్యను కొనియాడుతూ నెటిజన్లు మన్మోహన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. చాలా మంది ఎంపీలకు, నేతలకు ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. కాగా.. ఈ బిల్లు నెగ్గితే ఢిల్లీ ప్రభుత్వ ఆఫీసర్ల అధికారాలకు కత్తెర పడుతుందని, ఎలాగైనా బిల్లును ఓడించేందుకు ఓటింగ్ లో పాల్గొనాలని ఆప్ నేతల విజ్ఞప్తిపై రాజ్యసభకు వచ్చి ఓటేశారు.
పాక్‌లో పుట్టి, భారత్‌కు ప్రధాని..
డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్ లోని పశ్చిమ పంజాబ్‌లో గహ్ అనే ప్రాంతంలో జన్మించారు. 1947లో దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారత్ కు వలస వచ్చింది. 1958 సెప్టెంబర్ 14న గురుశరణ్ కౌర్ ను పెండ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్ ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఆయనను ప్రత్యేక స్థానంలో నిలిపాయి.
ఆర్థికశాస్త్రంలో డిగ్రీ, పీజీ
మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి 1952లో ఆర్థికశాస్త్రంలో బీఏ డిగ్రీ, 1954లో అదే వర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు. తర్వాత కేంబ్రిడ్జ్ నుంచి ట్రైపోస్, 1962లో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. హోనరిస్ కాసా నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించారు. 1957 నుంచి 1959 మధ్య ఎకనామిక్స్‌లో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి 63 మధ్యలో రీడర్‌గా వ్యవహరించారు. 1963–65లో పంజాబ్ వర్సిటీ చండీగఢ్‌లో ప్రొఫెసర్‌గా సేవలందించారు.
మన్మోహన్సింగ్.. లెజెండ్
భారతదేశం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. మన్మోహన్సింగ్ మరణం తీరని లోటు. ఆయన గొప్ప ఆర్థిక సంస్కర్త, ప్రజా నాయకుడు. నవ భారత రూపశిల్పి, లెజెండ్.. మన్మోహన్సింగ్. ఆయన సేవలను దేశం ఎన్నటికీ మరువదు.
సీఎం రేవంత్‌రెడ్డి
ఉద్యమాన్ని అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి
మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పాటవడం చారిత్రక సందర్భం. రాష్ట్ర సాధన సమయంలో ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆ సందర్భంలోనే కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు కుదిరింది. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన అందించిన మద్దతును తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
యువతరానికి ఆదర్శం
మేధావి, మితభాషి, స్థిత ప్రజ్ఞత కల్గిన నేతగా మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ నేటి యుతరానికి ఆదర్శం. ఆర్బీఐ గవర్నర్ గా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా దేశానికి వన్నెతెచ్చారు. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి