ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
  • ఆర్బీఐ గవర్నర్, ఫైనాన్స్ మినిస్టర్​గా మన్మోహన్ సేవలు
  • 1991 ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడంలో కీలక పాత్ర
  • బ్యాంకింగ్ చట్టాల్లో న్యాయపరమైన సంస్కరణలు
  • పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలు

న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్​తో పాటు ఫైనాన్స్ మినిస్టర్​గానూ మన్మోహన్​ సింగ్ సేవలందించారు. బ్యాంకింగ్ సెక్టార్​లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1982, సెప్టెంబర్ 16 నుంచి 1985, జనవరి 14 వరకు ఆర్బీఐకి 15వ గవర్నర్​గా సేవలందించారు. అప్పుడు బ్యాంకింగ్ సేవలు పరిమితంగానే ఉన్నాయి. ఈ సెక్టార్​లో న్యాయపరమైన సంస్కరణలు తీసుకొచ్చారు. 1991 నాటి ఎకానమీ లిబరలైజేషన్​కు ఈ సంస్కరణలు పునాదిగా నిలిచాయి. బ్యాంకుల్లో లీజింగ్ సర్వీసులతో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1983లో బ్యాంకింగ్ చట్టాలకు సవరణలు చేశారు. 

అకౌంట్లకు నామినీని పెట్టుకునే సదుపాయాన్ని తీసుకొచ్చారు. కార్పొరేట్ స్టేటస్ లేని కంపెనీలు.. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడంపై మన్మోహన్ సింగ్ నిషేధం విధించారు. అర్బన్ బ్యాంకింగ్ డిపార్ట్​మెంట్​ను ఏర్పాటు చేశారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల రెగ్యులేషన్స్​ను మెరుగుపర్చడంలో ఈ డిపార్ట్​మెంట్ ఎంతో కీలక పాత్ర పోషించింది.

ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి ప్రాధాన్యత

మానిటరీ పాలసీలో ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి మన్మోహన్ సింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1985 టైమ్​లో బ్యాంకులు నిర్వహించాల్సిన రిజర్వ్ రేషియో చాలా ఎక్కువగా ఉండేది. మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలతో.. బ్యాంకులు ఫ్రీ అయ్యాయి. అప్పులు ఇవ్వడాన్ని పెంచాయి. 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ చైర్మన్​గా కూడా సేవలందించారు. 

ఆర్థిక అంశాలపై మాజీ ప్రధాని చంద్రశేఖర్​కు అడ్వైజర్​గా ఉన్నారు. పీవీ నర్సింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ఫైనాన్స్ మినిస్టర్​గా సేవలందించారు.  1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రైవేట్ సెక్టార్, విదేశీ ఇన్వెస్ట్​మెంట్లకు అనుమతులు ఇచ్చారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టారు.