మన్మోహన్​ సింగ్ ​గొప్ప ఆర్థికవేత్త.. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడారు: చెన్నూరు ఎమ్మెల్యే

కోల్​బెల్ట్, వెలుగు: ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఆ ప్రభావం మన దేశంపై పడకుండా చూసిన గొప్ప ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆర్థిక మంత్రిగా, దేశప్రధానిగా మన్మోహన్ ​సింగ్​ ఎన్నో సంస్కరణలు, పాలసీలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని గుర్తుచేశారు. దుబాయ్​లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ ​సంతాపసభకు ఎమ్మెల్యే వివేక్​ ముఖ్య అతిథిగా హాజయ్యారు. మన్మోహన్​ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. దేశ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడిగా మన్మోహన్​ సింగ్​ పేరు పొందారన్నారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి.. మూడు వారాల ఫారిన్​ రిజర్వులను బ్యాలెన్స్​ చేస్తూ పరిస్థితిని గాడిలో పెట్టి.. దేశం దివాలా తీసే పరిస్థితి నుంచి గట్టెక్కించారని గుర్తుచేశారు. 2008లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రభావం దేశంపై పడకుండా చూసిన ఘనత పీవీకే సొంతమన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు కేబినెట్​లో మంత్రిగా ఉన్నారని, ఆయన ఎప్పుడూ పేద ప్రజల కోసం ఆలోచించేవారన్నారు. కాకా వెంకటస్వామితో మన్మోహన్​ సింగ్​కు మంచి స్నేహం ఉందని గుర్తుచేశారు. 

ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్న సమయంలో గ్రామీణ, మారుమూల ప్రాంత పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చాలని కాకా కోరడంతో.. వారిని ఆదుకునేందుకు మన్మోహన్​ సింగ్​రూ.5 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లతో రూరల్ ​డెవలప్​మెంట్​ ఫండ్ ​ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, సామాన్యులకు కష్టం కలగకుండా చూశారన్నారు. మన్మోహన్​ సింగ్ ప్రధానిగా ఉన్న​హయాంలో దేశం ఆర్థికంగా అనూహ్య వృద్ధిని నమోదు చేసిందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ను నిలబెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందని వివేక్​ కొనియాడారు.