మన ఆధార్ కార్డ్ సృష్టికర్త.. మన మన్మోహన్ సింగ్నే..!

మన ఆధార్ కార్డ్ సృష్టికర్త.. మన మన్మోహన్ సింగ్నే..!

మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన హయాంలో దేశంలో పలు కీలక సంస్కరణలు జరిగాయి. ఒక ఆర్థికవేత్తగా పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘ఆధార్ కార్డ్’ గురించి. దేశ పౌరులకు ‘ఆధార్’ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు మన్మోహన్ దూరదృష్టికి ఒక నిదర్శనం. ఈ ఆధార్ కార్డు సృష్టికర్త మరెవరో కాదు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ ఆధార్ కార్డ్ అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో ఐక్యరాజ్య సమితి మన్మోహన్ దార్శనీకతపై ప్రశంసల వర్షం కురిపించింది.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. మన్మోహన్ సింగ్ ఆధార్ కార్డ్ ఆలోచన చేసినప్పుడు విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ కార్డు ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి సమాచారం తీసుకుంటుందని.. ఇలా తీసుకున్న సమచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని మన్మోహన్ ఆధార్ కార్డ్ యోచనను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ అనుమానాల్లో ఎలాంటి పస లేదని ఆధార్ కార్డు అమలుతో మన్మోహన్ సింగ్ నిరూపించారు. 

సగటు భారతీయుడికి ఇప్పుడు ఆధార్ ఒక ఐడెంటిటీ. పాన్ కార్డ్, మొబైల్ నంబర్, బ్యాంకు అకౌంట్.. ఇలా ఏది సామాన్యుడికి చేరువ కావాలన్నా ఆధార్ అనుసంధానం తప్పనిసరి. డిజిటలైజేషన్ దిశగా భారత్ ఇంతలా వృద్ధి చెందడంలో ఆధార్ పాత్ర ఎనలేనిది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో.. సోనియా గాంధీ, మన్మోహన్ చేతుల మీదుగా ఈ ఆధార్ కార్డ్ విధానం మన దేశంలో అమల్లోకి వచ్చింది.

Also Read :- డిసెంబర్ 28న మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు

దేశంలో తొలి ఆధార్ కార్డును రంజన సోనావానె అనే మహిళ 2010, సెప్టెంబర్ 29న మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకుంది. మహారాష్ట్రలోని నందూర్ బర్ జిల్లా తంభాలి గ్రామానికి చెందిన రంజన్ సోనావానె 48 ఏళ్ల వయసులో తన ఆధార్ కార్డును అందుకున్నారు. అప్పటికి ఆమెకు ముగ్గురు పిల్లలు. దేశంలో తొలి ఆధార్ కార్డ్ అందుకున్న మహిళగా రంజన వార్తల్లో నిలిచింది. ఆధార్ కార్డ్ను 12 డిజిట్ నంబర్తో అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 

ప్రతిపక్షాల విమర్శలతో ఢీలా పడిపోకుండా ప్రధానిగా మన్మోహన్ ఆధార్ కార్డును దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి చిరస్థాయిలో నిలిచిపోయారు. దేశంలో ఆధార్ కార్డ్ అమల్లో ఉన్నంత కాలం మన్మోహన్ పేరు గుర్తుచేసుకోకుండా ఉండలేం. సౌమ్యుడు, మృదు స్వభావి అయిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం రాజ్ ఘాట్ సమీపంలో జరగనున్నాయి.