మన్మోహన్ మెమోరియల్​కు మూడు ప్లేస్​లను ఎంపిక చేసిన కేంద్రం

మన్మోహన్ మెమోరియల్​కు మూడు ప్లేస్​లను ఎంపిక చేసిన కేంద్రం
  • ఒక స్థలాన్ని కన్ఫాం చెయ్యాలని మాజీ ప్రధాని కుటుంబానికి సూచన


న్యూఢిల్లీ:  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్మారకాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. ఢిల్లీలోని రాజ్ ఘాట్ (మహాత్మా గాంధీ సమాధి), రాష్ట్రీయ స్మృతి స్థల్ (ఐకే గుజ్రాల్ సమాధి) లేదా కిసాన్ ఘాట్ (చౌధరి చరణ్ సింగ్ సమాధి) సమీపంలోని ఏదో ఒక స్థలాన్ని సూచించాలని ఈ మేరకు మన్మోహన్ కుటుంబాన్ని సర్కారు కోరింది.

వీటిలో ఏదో ఒక స్థలాన్ని ఎంపిక చేస్తే.. ఆ వెంటనే స్మారక నిర్మాణ పనులు మొదలుపెడతామని తెలిపింది. రాజ్ ఘాట్ లేదా సమీప ప్రాంతాల్లో దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరాల స్థలంలో మన్మోహన్ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థలాలను ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పరిశీలించి, స్మారకానికి అనువుగానే ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.

అయితే, ఈ మూడింటిలో ఏదో ఒక స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత.. నిబంధనల ప్రకారం ముందుగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ట్రస్టు ఏర్పాటు తర్వాత భూమిని కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఆ ట్రస్టుతో కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఎంఓయూ కుదుర్చుకుని, నిర్మాణ పనులను ప్రారంభించనుంది. కాగా, మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యల కారణంగా 92 ఏండ్ల వయసులో పోయిన నెల 26న మరణించగా, ఆయనకు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు.