ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. 11 కి.మీ మేర సాగిన అంతిమ యాత్ర

ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. 11 కి.మీ మేర సాగిన అంతిమ యాత్ర

న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థిక వేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియులు ముగిశాయి. శనివారం (డిసెంబర్ 28) ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన అంతిమయాత్ర నిగమ్‎బోద్ ఘాట్ వరకు 11 కిలో మీటర్ల మేర సాగింది. ఆర్థిక సంస్కరణలవాదికి తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

అంతిమయాత్ర సమయంలో మన్మోహన్ సింగ్ పార్థివదేహం ఉన్న వాహనంలోనే రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు కుర్చుకుని స్మశాన వాటికకు చేరుకున్నారు. నిగమ్ బోద్ ఘాట్‎లో సైనిక లాంఛనాల నడుమ జరిగిన మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజుజు హాజరై నివాళులు అర్పించారు. 

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్‎ పార్థివదేహాంపై జాతీయ జెండా ఉంచి భారత త్రివిధ దళాలు ఆర్థిక సంస్కరణలవాదికి ఘన నివాళులర్పించాయి. అనంతరం మన్మోహన్ సింగ్ చితికి ఆయన కూతురు నిప్పంటించారు.