సెల్ఫీ దిగుతూ నీటిలో జారిపడ్డ యువకుడు

నల్గొండ జిల్లా: సెల్ఫీ దిగుతూ డ్యామ్ గేట్ల వద్ద నీటిలో యువకుడు జారిపడ్డ ఘటన డిండి ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. స్నేహితులతో కలసి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన మనోజ్ (22) అనే యువకుడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు, ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది. స్నేహితులంతా కలసి సరదాగా మొదలుపెట్టిన విహారయాత్ర యువకుడి గల్లంతుతో విషాదం అలుముకుంది. 

నీటిలో జారిపడి గల్లంతైన మనోజ్ (22) తన ఆరుగురు స్నేహితులతో కలసి గణేష్ నిమజ్జనం సందర్భంగా శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గం మధ్యలో డిండి ప్రాజెక్టు ను చూడాలని వచ్చారు. మనోజ్ డిండి ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల వద్ద నిల్చుకుని సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారి నీటిలో పడ్డాడు. హఠాత్తుగా జరిగిన ఘటనతో స్నేహితులు తేరుకుని కేకలు వేయగా.. ఇరిగేషన్ సిబ్బంది హుటాహుటిన వచ్చి గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన మనోజ్ ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నాలు చేపట్టారు.