సెంచరీ చేసినా జట్టు నుంచి తీసేశాడు.. ధోనీపై మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

సెంచరీ చేసినా జట్టు నుంచి తీసేశాడు.. ధోనీపై మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

మనోజ్ తివారి అంటే భారత క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఐపీఎల్ లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం ఈ బెంగాల్ క్రీడా మంత్రికి అపార అనుభవం ఉంది. 30 సెంచరీలతో పాటు 45 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇదిలా ఉంటే.. మనోజ్ తివారీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు నిన్న (ఫిబ్రవరి 19)  రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా భారత మాజీ కెప్టెన్ ధోనీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

రిటైర్డ్ బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ ధోనీకి సూటి ప్రశ్న విసిరాడు. 2011లో తొలి వన్డే సెంచరీ చేసినప్పటికీ కెప్టెన్ MS ధోనీ భారత జట్టులో నుంచి తొలగించాడని చెప్పుకొచ్చాడు. కలకత్తా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్‌లో తన సన్మానం సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ.. భారత జట్టు నుండి మాజీ కెప్టెన్ MS ధోని తనను తొలగించకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా అత్యుత్తమ బ్యాటర్‌గా తాను అయ్యేవాడని చెప్పాడు. 2012లో ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్, కోహ్లి, సురేశ్ రైనా పరుగులేమీ చేయలేదని అన్నాడు. 

38 ఏళ్ల తివారి 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 126 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. తివారీ తన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే సెంచరీ చేసినా తివారీకి ఆ తర్వాత భారత జట్టుకు ఎంపిక చేయకుండా పక్కన పెట్టారు. అప్పుడు భారత కెప్టెన్ గా ధోనీ ఉన్నాడు. 

also read : బుమ్రాకు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నాలుగో టెస్టుకు రాహుల్ ఫిట్!

మనోజ్ తివారీ టీమిండియా తరఫున 12 వన్డేల్లో 26.09 సగటుతో ఒక సెంచరీతో సహా 287 పరుగులు చేశాడు. 3 టీ20 మ్యాచ్ ల్లో ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడి 15 పరుగులు చేశాడు. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున చివ‌రిసారి 2015లో జింబాబ్వేపై వన్డే ఆడిన తివారీ.. ఆ మ్యాచ్ లో 10 పరుగులు చేశాడు.41 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 30 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. తివారీ.. ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్, రైసింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌ ఫ్రాంచైజీల తరుపున ఆడాడు.