ఆగస్ట్ 3న అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ క్రికెటర్, స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారీ వారం రోజులు కూడా గడవకముందే మనసు మార్చుకున్నారు. తాను మరో ఏడాది పాటు క్రికెట్‌లో కొనసాగుతానని, బెంగాల్ జట్టుకు రంజీ ట్రోఫీ అందించడానికి ఇంకొక్క ప్రయత్నం చేస్తానని తెలిపారు.
"కొన్నిసార్లు మన చివరి అవకాశమే.. మన మొదటి విజయం అవుతుంది. అందుకే మరొక్క ఏడాది ఆడాలన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తున్నా. బెంగాల్ క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. నేను కూడా నా సహచరులతో కలిసి బెంగాల్ జట్టుకు రంజీ ట్రోఫీ అందించాలని ఆశిస్తున్నా. అందుకే క్రికెట్ మళ్లీ ఆడబోతున్నా. ఇబ్బంది పెట్టినందుకు అభిమానులు నన్ను మన్నించాలి.." అంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.
Sometimes our last chance becomes our first Success ?
— MANOJ TIWARY (@tiwarymanoj) August 8, 2023
Giving it myself one more year for bengal cricket team to play and win the Ranji trophy with my teammates ? So I’m back playing the game which has been my passion and love all my life ❤️
Sorry for the inconvenience ? pic.twitter.com/6kyFhNQjJv
మొన్న తమీమ్ ఇక్బాల్.. నేడు మనోజ్ తివారి
ఇటీవల కాలంలో ఇలా రిటైర్మెంట్ ఇచ్చి, వెనక్కి తీసుకున్న రెండో క్రికెటర్ మనోజ్ తివారి. గత నెలలో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఇలానే రిటైర్మెంట్ ప్రకటించి, 24 గంటలు గడవకముందే దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక్బాల్‌ని రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాల్సిందిగా బంగ్లా ప్రధాని షేక్ హాసీనా కోరరడంతో అతను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
ఇప్పుడు తివారీ విషయంలోనూ అదే జరిగింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహాశీష్ గంగూలీ అతన్ని మరో ఏడాది పాటు బెంగాల్ జట్టు కెప్టెన్‌గా కొనసాగాలని కోరడం వల్లే.. తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని నిర్ణయం తీసుకున్నారు.
మ్యాచ్‌లు తక్కువే.. కానీ
మనోజ్ తివారి ఆడిన అంతర్జాతీయ మ్యాచుల సంఖ్య తక్కువే కానీ, ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అతడు మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. 2008 ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తివారి.. దేశం తరుపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడాడు.
ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 119 మ్యాచులు ఆడిన తివారి, ఓ త్రిబుల్ సెంచరీతో పాటు 27 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 8752 పరుగులు చేశారు. అలాగే లిస్టు ఏ క్రికెట్‌లో 163 మ్యాచులు ఆడిన తివారి.. 6 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలతో 5466 పరుగులు చేశారు.