హైదరాబాద్: మంచు కుటుంబంలో వివాదం ముదిరింది. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని గొడవలు రచ్చకెక్కడంతో మంచు విష్ణు మంగళవారం(డిసెంబర్ 10-,2024) హుటాహుటిన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంచు విష్ణు భారీ సెక్యూరిటీ మధ్య తన ఇంటికి వెళ్లాడు. మంచు మనోజ్, తన భార్య నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసిన మోహన్ బాబు తన ఇంట్లో జరుగుతున్న గొడవలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని, ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. తమ ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇదని, పరిష్కరించుకుంటామని తెలిపాడు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించానని, కలిసేలా చేశానని మోహన్ బాబు గుర్తుచేశాడు. కానీ.. తన కుటుంబంలోనే గొడవలు రేగి పరిస్థితులు తెగే దాకా లాగేంత వరకూ రావడం గమనార్హం.
మోహన్‌బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇప్పటికే పహాడీషరీఫ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదుతో మనోజ్‌పై, మనోజ్ భార్య మౌనికపై కూడా కేసు నమోదు చేశారు. మనోజ్, మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మనోజ్ ఫిర్యాదుతో మోహన్‌బాబు అనుచరులపై కేసు నమోదు చేశారు. 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు కావడం గమనార్హం. విష్ణు కూడా ఈ ఇంటి గొడవలో ఇన్వాల్వ్ అయ్యేందుకు దుబాయ్ నుంచి రావడంతో జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇంటి చుట్టూ భారీగా బౌన్సర్లు మోహరించారు.