- 1:3 రేషియోలో నకిలీ కరెన్సీ ఇస్తామని ట్రాప్
- చిల్డ్రన్స్ బ్యాంక్ బొమ్మ నోట్లను నకిలీ కరెన్సీగా సేల్
- పోలీసులమని బెదిరించి అసలు నోట్లతో ఎస్కేప్
- ముగ్గురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
- నిందితుల్లో మాజీ ఫారెస్ట్ అధికారి
హైదరాబాద్,వెలుగు : చిన్నారులు ఆడుకునే బొమ్మ కరెన్సీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. బేగంబజార్‌లో బొమ్మనోట్లు కొనుగోలు చేసి నకిలీ కరెన్సీ నోట్ల తరహాలో1:3 రేషియో కింద అమ్ముతున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మనోరంజన్(చిల్ర్డన్స్ బ్యాంకు)పేరుతో ఉన్న 120 బొమ్మ నోట్ల బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ పేరుతో వరుస మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు శుక్రవారం మీడియాకు తెలిపారు.
చిన్నారులు ఆడుకునే బొమ్మ నోట్లతో..
ఆదిలాబాద్ జిల్లా బుక్తాపూర్కు చెందిన మహమ్మద్బహుద్దీన్(53) ఉట్నూరు రేంజ్ ఫారెస్ట్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంతో 2014లో సస్పెండ్ అయ్యాడు.ఆ తర్వాత రియల్ఎస్టేట్ బ్రోకర్‌గా చేశాడు.ఈ క్రమంలో నిజమాబాద్‌కు చెందిన సల్మాన్ పరిచయం అయ్యాడు. బొమ్మ నోట్లు,ఫేక్ కరెన్సీతో ప్రజలను ఎలా మోసం చేయాలో సల్మాన్ ట్రైనింగ్ ఇచ్చాడు. శంషాబాద్ఎయిర్పోర్టులో టాక్సీ డ్రైవర్ నిజామాబాద్ జిల్లా ధర్మారానికి చెందిన జంపని అండర్సన్(37)ను పరిచయం చేశాడు. వీరితో పాటు నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్ చెందిన మగ్గిది కిషన్(27)తో కలిసి ఫేక్ నోట్ల దందా ప్రారంభించారు.
బొమ్మ నోట్లను నకిలీ కరెన్సీగా చూపిస్తూ
బేగంబజార్‌లో మనోరంజన్ బ్యాంకు పేరుతో ప్రింట్ అయిన బొమ్మ నోట్లను కొనుగోలు చేసేవారు. నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తామని నమ్మించేవారు. ఫ్రెండ్స్,కుటుంబ సభ్యుల ద్వారా అమాయకులను టార్గెట్ చేసేవారు. అసలు నోట్లు బొమ్మనోట్లను గుర్తించలేరని నిర్ధారించుకుని ఆ తర్వాత బొమ్మ నోట్లను నకిలీ కరెన్సీ నోట్లుగా చూపేవారు.1:3 రేషియో కింద సేల్ చేస్తామని నమ్మించేవారు. ఇలా తమ ట్రాప్‌లో చిక్కిన వారి వద్ద అసలు నోట్లు తీసుకునేవారు. అదే సమయంలో తమ వారిలో ఒకరు పోలీస్‌గా నటించేవారు. ఇలా అమాయకులను బెదిరించి అసలు నోట్లతో పారిపోయేవారు.
ఇలా దొరికారు
నిర్మల్, నిజామాబాద్,ఆర్మూర్,ఎల్‌బీనగర్, మహారాష్ట్రలోని పంధర్‌కవాడ, యవత్‌మల్ ప్రాంతాల్లో బహుద్దీన్ వరుస మోసాలు చేశాడు. గురువారం కూడా బేగంబజార్‌లో బొమ్మనోట్లు కొనుగోలు చేశాడు. ఎల్‌బీనగర్‌లోని సితార గ్రాండ్ హోటల్ సమీపంలో కస్టమర్లను కలిసేందుకు యత్నించాడు. ముఠాపై అప్పటికే నిఘా పెట్టిన ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు వెంటనే వెళ్లి బహుద్దీన్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద 120 బండిల్స్‌తో ఉన్న మనోరంజన్ బ్యాంక్ బొమ్మ నోట్లను స్వాధీనం చేసున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.