మనిషి జీవితం కకావికలమై, బీభత్సమై ముందెప్పుడూ లేనంత విధ్వంసానికి అణచివేతకు గురవుతున్నది. ఆత్మహత్యలకు అకారణంగా చావులకు లోనవుతున్న తీరు తెల్లారి లేస్తే మన కనుల ముందు కదలాడుతున్నది. పట్టనితనం, నాకేం అనే గుణంతో మొద్దు నిద్ర నటిస్తున్న మనిషి వేల చీలికలై ప్రశ్నల కూడలిలో నిలబడ్డాడు. ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ పరిస్థితులలో తెలంగాణ మేధావులకు ఏవీ కానరాకపోవడం, వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం అటు ఉంచితే, ఒక అదృశ్యశక్తి వలలో చిక్కుకొని.. తెలంగాణ ఆత్మగౌరవం విగ్రహాల స్థాపన స్థలాల్లో ఇమిడి ఉన్నట్టు తెగ బెంగపడిపోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటకాగినవారు..చెడువినకూడదు, కనకూడదు, మాట్లాడకూడదు అన్నట్టున్నారు. అయినా, అప్పట్లో ఓహో అంటే ఓహో అంటూ పొగిడినవారు.. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి ఏదో భంగం కలిగినట్టు వాపోతున్నారు. తెలంగాణతల్లి విగ్రహానికి ఏదో అపచారం జరిగినట్టు, ఎవరో అవమానపరిచినట్టు హాహాకారాలు చేస్తున్నారు. వీరిని చూస్తుంటే గాంధీ మూడు కోతులు యాదికి వస్తున్నాయి.
ఒకటో కోతి
తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో కన్నా ముందుగా సాహిత్య రంగంలో పోలరైజేషన్ జరిగింది. రెండు భాగాలుగా విడిపోయారు. ఒకవర్గం ప్రజల పక్షం వహించి తమ కవిత్వాన్ని, పాటలను, రాతలను కొనసాగిస్తే .. మరొక వర్గం ప్రభుత్వం కొమ్ముగాసి అధినాయకుడు నోటి నుంచి మాట వెలువడీ వెలువడక ముందే తమ సుప్రభాత స్తోత్రాలను ఉత్తిష్ట ఉత్తిష్ట అని అధికార గూటి పలుకులు పలికారు. తెలంగాణ ఉద్యమ కాలంలో 1300 మంది యువకులు బలిదానం చేసుకున్న త్యాగాలు, వారి కుటుంబాల స్థితిగతులు వీరిని కొంచెం కూడా కదిలించకపోవడం, వారి గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యకరంగా కనిపించలేదు. కానీ, ఏలికను అనేక పోలికలతో వర్ణించి మునగ చెట్టు ఎక్కించారు. ఇంకొందరు తెలంగాణ ఉద్యమం అహింసా పోరాటమని వర్ణించిన అతి తెలివిగల మేధావులూ ఉన్నారు. వేలాదిమంది సన్నకారు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీరి కళ్ళకు కనీసం కనిపించకపోవడం అటుంచి, గత ప్రభుత్వ ప్రధాన కథానాయకులకి వంతలుగా మారి వైన వైనాలుగా వినిపించారు. నియంతృత్వ పోకడలను పొగడడానికి దైవాంశ సంభూతుడని కీర్తించడానికి వీరు పోటీపడ్డారు. వీళ్ళ కళ్ళకు ఏమీ కనబడకుండా గాంధీగారి ఒకటో కోతిలాగ కళ్ళు మూసుకున్నారు.
రెండో కోతి
వివిధ ప్రాజెక్టుల పేరు మీద రూపొందించిన పథకాలలో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి మీడియా, సోషల్ మీడియా కోడై కూస్తుంటే వీరి చెవులకు ఏదీ వినపడకపోవడం సామాన్యులను కూడా విస్తుపోయేలా చేసింది. కానీ, సర్కార్ బడులకు సమాధులు కట్టేందుకు ఇటికలు పేర్చారు. రాష్ట్రం ఏర్పడక ముందు నారాయణ, చైతన్యలను చీల్చి చెండాడినవారు రాష్ట్రం సిద్ధించాక మరింత ప్రైవేటు విద్యకు దర్వాజాలు తెరిచారు. ఒక్క ఉపాధ్యాయుని నియామకం కూడా చేయకుండా విద్యను మూడు పూలు ఆరు కాయలుగా బహు చక్కగా తీర్చి దిద్దారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ రూ.15,000 కోట్లు దాటని ఎక్సైజ్ ఆదాయం రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.35 వేల కోట్ల వరకు పెంచి తెలంగాణ సామాన్య ప్రజల అష్టైశ్వర్యాలను పీల్చి పిప్పి చేశారు. వైద్యం ఖర్చులను లక్షల రూపాయలకు పెంచి ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందనంత దూరంగా నిర్లక్ష్యం చేశారు. కనీసం ప్రైవేటు వైద్యంలో వ్యాధుల నివారణ ఖర్చులను అదుపు చేయలేక రోగ, రుణగ్రస్త తెలంగాణను చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు వేలాదిమంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ధరణి తీసుకువచ్చి మళ్లీ ఒక వర్గాన్ని భూస్వాములను చేశారు. రైతుబంధు భూమిని సాగుచేసే రైతులకు చేరక వేలాది కోట్లు దుర్వినియోగం అయిపోయాయి. ఏలిన వారి కళ్ళకు ఇవేవీ కనబడలేదు. పైగా తెలంగాణ అంతా బంగారు తునక అయిందని రాతలు రాసి కోతలు కోశారు. గడ్డివాము మీద పడ్డట్టు మేతలు వేశారు. వీరు దేన్నీ నోరు తెరిచి అడగలేదు. ప్రశ్నించలేదు. గాంధీగారి రెండో కోతిలా చెవులు మూసుకున్నారు.
మూడో కోతి
ఆలోచనాపరులు, మేధావులు ఇలా ఉంటే రాజకీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పరివారం ప్రజాస్వామ్యం పేరిట రాజరికాన్ని అమలుపరిచారు. ప్రజలకే కాదు మంత్రులకు, శాసనసభ్యులకు గత ముఖ్యమంత్రి దివ్యదర్శనం దుర్లభమైపోయింది. ఊరందరిది ఒక దారి..ఉలిపి కట్టది మరోదారి అన్నట్టు ముఖ్యమంత్రి రాచకొండ ప్రభువుగా తనను తాను ఊహించుకొని నేల మీద అడుగు పెట్టకుండా ఆకాశంలో ఊరేగారు. ప్రజలకు వివిధ పెన్షన్లను అందజేసి, తాము తమ కుటుంబ సభ్యులు కొన్ని వందల సంవత్సరాల పాటు బతికేలా సంపద పోగేసుకున్నారు. ఆధిపత్య ప్రాంతం పెనం మీంచి తెలంగాణ నిప్పుల పొయ్యిలో పడ్డట్టయింది. అయినా గొప్పలు చెప్పుకోవడానికి తప్పులు సరి చేసుకోకుండానే అనేక తిప్పలు పడుతున్నారు. నోరు మూసుకొని ఇప్పుడు పెద్దగా మూడో కోతిలా పల్లెత్తు మాట్లాడడంలేదు. తెలంగాణ ఆగమాగం కావడానికి మేధోరాజకీయ వర్గం తప్పును తప్పు అని వేలెత్తి చూపెట్టక, చూడక, వినక, మాట్లాడకపోవడం వలన తెలంగాణ ఇవ్వాళ ఈ ఈదుర్దశకు చేరింది.
- జూకంటి జగన్నాథం, కవి, రచయిత