ఆధునిక నాటకానికి మార్గదర్శి

 ఆధునిక నాటకానికి మార్గదర్శి

విశ్లేషణ:తెలుగు నాటక రంగంలో నూతన శైలిని ఆవిష్కరించాలని కలలుగని, ఆ ఆశలతో ఖండాంతరాలకు వెళ్లి ప్రపంచ నాటకాన్ని దర్శించి నిజం చేసుకున్న దార్శనికుడు  మంత్రి శ్రీనివాసరావు. అక్కడ ఆధునిక నాటక రంగంలో శిక్షణ పొంది, తెలుగు నేలపై నాటకం కొత్త నడక నేర్చుకోవడానికి దోహదపడిన మార్గదర్శి ఆయన. 20వ శతాబ్ది ద్వితీయార్థంలో తెలుగు నాటక రంగాన్ని బలమైన పునాదులపై నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. నాటక రంగం ఆధునిక యుగంలోకి  ప్రవేశించడానికి ఆయన చేసిన కృషి మరువలేనిది.

హైదరాబాద్ సమీపంలోని కందుకూరు మండలం బచ్చుపల్లి గ్రామంలో 1928 జనవరి 1న తెలంగాణ దేశ్ ముఖ్ ల కుటుంబంలో మంత్రి శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రామచంద్రరావు, తల్లి రాజ్యలక్ష్మి. చిన్నప్పటి నుంచే ఆయనపై దేశీ నాటకాలు, పద్య నాటకాల ప్రభావం పడింది. ఆయన ఉన్నత విద్యాభ్యాసం నిజాం కళాశాలలో సాగింది. ఆ రోజుల్లో నిజాం కళాశాల ప్రఖ్యాతి గాంచిన అధ్యాపకులు, పండితుల సారథ్యంలో విశిష్టమైన విద్యా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతుండేది. ఈ వాతావరణంలో మంత్రి శ్రీనివాసరావు సాంస్కృతిక రంగం వైపు ఆకర్షితులయ్యారు. అక్కడ ఆంగ్ల, ఉర్దూ నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యమే తర్వాత కాలంలో ఆయనకు హైదరాబాద్ లో నాటక రంగ వ్యాప్తితోపాటు తెలుగు నాటక రంగానికి దిశానిర్దేశం చేసే అవకాశం కల్పించింది. 

తెలుగు భాషకు ప్రాధాన్యత లేని రోజుల్లోనే..
నాటి నిజాం పాలనలో తెలుగు భాషకు అంతగా ప్రాధాన్యత లేని రోజులవి. దాని ప్రభావం సమకాలీన నాటక రంగంపై స్పష్టంగా కనిపించేది. ఈ సమయంలో తెలుగు భాషాభిమానం కలిగిన మంత్రి శ్రీనివాసరావు నిజాం కళాశాల అధిపతిని ఒప్పించి 1946---–47లో తొలిసారి ‘ఆంధ్రాభ్యుదయ నాటకోత్సవాల’ పేరుతో తెలుగు నాటక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల్లో ఆయన తొలిసారి చెకోవ్ రాసిన ‘ప్రపోజల్’ నాటకాన్ని తెలుగులోకి అనువదించి స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించారు. మంత్రిలోని ఈ చురుకైన స్వభావం ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్టు అబ్బూరి వరదరాజేశ్వరరావుకు దగ్గర చేసింది. ఆయన సలహాతో నాటక రంగంపై మంత్రి శ్రీనివాసరావు మరింత దృష్టి సారించారు. అంతేకాదు, సరోజినీ నాయుడు కుమారుడు జయసూర్య పరిచయంతో ప్రపంచ నాటక రంగ అధ్యయనం వైపు ఆకర్షితులయ్యారు. జయసూర్య అనేక ప్రపంచ నాటక గ్రంథాలను మంత్రికి అందించి, నాటక అధ్యయనానికి దోహదపడ్డారు.

ఐఎన్​టీని ఏర్పాటు చేసి..
హైదరాబాద్ లో ఆంగ్ల నాటకాల వ్యాప్తికి కృషి చేసిన నాటకకర్త హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ్, ఆయన భార్య కమలాదేవి జాతీయ నాటక సంఘానికి అధ్యక్షులుగా ఉండేవారు. ఆమె ప్రోత్సాహంతో 1952లో ప్రఖ్యాత నాటక ప్రయోక్త ఏఆర్ కృష్ణతో కలిసి ఆ సంస్థకు అనుబంధంగా హైదరాబాద్ లో ఇండియన్ నేషనల్ థియేటర్(ఐఎన్​టీ)ను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ వేదికగా ఐఎన్​టీ నాటకోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడుగా ఉండేవారు. ఈ ఉత్సవాల్లో బెల్లంకొండ రామదాసు ‘మాస్టార్టీ’ నాటకాన్ని మంత్రితోపాటు ఏఆర్ కృష్ణ, తురగా కృష్ణమోహన్, పన్నూరి రామారావు కలిసి ప్రదర్శించారు. ఆ తర్వాత జరిగిన ఉత్సవాల్లో మంత్రి ప్రధాన భూమిక పోషించారు. 1956లో రష్యన్ నాటక రచయిత గొగోల్ రచించిన ‘ఇన్ స్పెక్టర్ జనరల్’ను స్వీయ దర్శకత్వంలో మంత్రి ప్రదర్శించారు. సమాజంలోని అవినీతి, అవకతవకలను ఎత్తి చూపుతూ సాగే వ్యంగ్య నాటకం ఇది. 1957లో కుందుర్తి ఆంజనేయులు రాసిన ‘ఆశ’ నాటకాన్ని అనిబద్ద శైలిలో మంత్రి శ్రీనివాసరావు ప్రయోక్తగా ప్రయోగాత్మకంగా ప్రదర్శిస్తే, ఇందులో ప్రొఫెసర్ రమామెల్కోటే ప్రధాన పాత్రలో నటించారు. అలాగే శ్రీశ్రీ రచించిన ‘విధూషకుడి ఆత్మహత్య’ మంత్రి దర్శకత్వంలో ఆవిష్కృతమై ప్రయోగాత్మక నాటికగా పేరుగాంచింది.

అబ్బూరి శిష్యరికంలో..
బహు భాషావేత్త, ప్రఖ్యాత కవి అబ్బూరి రామకృష్ణారావు ‘నటాలి’ పేరుతో డ్రామా రిపక్టరీని నిర్వహిస్తూ నాటకాలను ప్రదర్శించేవారు. ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగిగా రిటైర్​ అయిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా నాటక రంగ అభివృద్ధికి పూనుకున్నారు. అబ్బూరి పరిచయంతో శ్రీనివాసరావు నాటకాన్ని ఆధునిక కోణంలో చూడటం మొదలుపెట్టారు. ఆయనకు ప్రియ శిష్యుడయ్యారు. 1959 లో అబ్బూరి నిర్దేశకత్వాన హైదరాబాద్ లో ప్రారంభమైన నాట్య విద్యాలయానికి ఏఆర్ కృష్ణ, మంత్రి శ్రీనివాసరావు అధ్యాపకులుగా ఉంటూ, నటనలో శాస్త్రీయ శిక్షణ అందించి ఎందరో ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దారు. నాట్య విద్యాలయం ఆధ్వర్యంలో ఆధునిక శైలిలో లైటింగ్, స్టేజ్ డిజైనింగ్ తో ప్రదర్శించిన నాటకాలు తెలుగు నాటక చరిత్రలో నిలిచిపోయాయి. అబ్బూరి దర్శకత్వంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తొలిసారి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్(నాటి సరోల్ బాగ్)లో తెరలు లేకుండా ప్రయోగాత్మకంగా గులాబీ మొక్కల అలంకరణతో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో మంత్రి కీలక భూమిక పోషించారు. ఈ నాటకంలో పిల్లవాడి పాత్రలో సినీనటుడు రాళ్లపల్లిని మంత్రి నాటక రంగానికి పరిచయం చేశారు. శూద్రకుడి ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని ఆధునిక రీతిలో ప్రదర్శించేందుకు మంత్రి సారథ్యం వహించారు. 1964లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఆహ్వానం మేరకు ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని ఢిల్లీ రాష్ట్రపతి భవనంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఆనాటి నాట్య విద్యాలయం ఒక థియేటర్ లేబరేటరీగా పని చేసేది. ఇక్కడ చెకోవ్ రాసిన ‘జూబ్లీ’, ‘ఏ డాల్స్ హౌస్’, ప్రతాపరుద్రీయం వంటి నాటకాలను కొత్తదనంతో ప్రదర్శించారు. నాటకరంగ అభివృద్ధికి మంత్రి శ్రీనివాసరావు చేసిన కృషిని గుర్తించి 1957లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి సభ్యుడిగా నియమించి గౌరవించింది ఆనాటి ప్రభుత్వం.

ఎందరో నటులకు స్ఫూర్తి
స్టానిస్లవిస్కీ నట శిక్షణ పద్ధతిలో ఎందరినో ఉత్తమ నటులుగా తీర్చిదిద్దారు. విభిన్నమైన ఇతివృత్తాలతో నాటకాలను ప్రదర్శించేవారు. ఆయన శాఖాధిపతిగా పని చేసిన కాలం ఒక స్వర్ణయుగమని ప్రఖ్యాత నటుడు మిశ్రా అన్నారు. సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ, అత్తిలి కృష్ణారావు, ఎస్ కే మిశ్రా, కృష్ణ చైతన్య, శరత్ బాబు వంటి వారు ఆయన శిష్యులే. ఆంధ్రా యూనివర్సిటీ నాటక శాఖలో తలమునకలై పని చేస్తున్న మంత్రి శ్రీనివాసరావు విశాఖపట్నంలో 1974 అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. ప్రపంచ నాటకాన్ని అభ్యసించి, ఆధునిక నాటక వ్యాప్తికి కొత్త తరాన్ని సన్నద్ధం చేస్తున్న సమయంలో 46వ ఏట తన జీవన నాటక రంగం నుంచి ఆయన నిష్క్రమించడం తెలుగు నాటక రంగానికి తీరని లోటును మిగిల్చింది. ఆయన మరికొంత కాలం జీవించి ఉంటే ఎందరో నటులను, దర్శకులను ప్రభావితం చేసి, నాటకాన్ని ఆధునికత వైపు పరుగులు పెట్టించేవారు. ‘మంత్రి హైదరాబాద్ లోనే స్థిరపడినట్లయితే తెలుగు నాటకం ఇంత అధోగతికి నోచుకుని ఉండదని విశ్వసించే వాళ్లలో నేనూ ఒక్కడిని’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. నిజమే.. ఆయన మరణం తెలుగు నాటకానికే కాదు, తెలంగాణ నాటకానికీ తీరని లోటును మిగిల్చింది. ఆయన నాటక రంగ ప్రస్థానాన్ని ఈ తరం గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.

కొత్త విషయాలు నేర్చుకునేందుకు తపన
నిరంతరం నాటక రంగంలో కొత్త విషయాలు నేర్చుకోవాలని మంత్రి శ్రీనివాసరావు తపన పడేవారు. 1961లో బొంబాయిలో బ్రిటిష్​ రంగస్థల నిపుణులు ‘హెర్బర్ట్ మార్షల్’ దగ్గర ఏడాదిపాటు నటనలో శాస్త్రీయ శిక్షణ పొందారు. అక్కడ ‘డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్’ అనే ఆంగ్ల నాటకంలో ముఖ్య భూమిక పోషించారు. ఆ తర్వాత 1963లో నటనలో ప్రత్యేక శిక్షణ నిమిత్తం లండన్ లోని ‘బ్రిటిష్​ డ్రామా లీగ్’కు దరఖాస్తు చేసుకున్నారు. ఇండియా నుంచి నలుగురిని మాత్రమే ఎంపిక చేసే ఈ కోర్సుకు అనేక వడపోతల్లో మంత్రి ఎంపికయ్యారు. అయితే, అవసరమైన మౌలిక వసతులు, వనరులు లేని కాలంలో మిత్రుల సహకారం తోడైంది. అయినా విమానంలో వెళ్లడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో 13 రోజులపాటు సముద్ర ప్రయాణం చేసి లండన్ చేరుకున్నారు. అక్కడ ఏడాదిపాటు శిక్షణ పొంది ‘యాక్టింగ్ డిప్లొమా’ సాధించిన కీర్తి శ్రీనివాసరావుకు దక్కింది. ఈ విద్యార్హతే 1966లో ఆయనను ఆంధ్రా యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్ డిపార్ట్​మెంట్ కు తొలి శాఖాధిపతిని చేసింది. అయితే నాటి తెలుగు నాటకాలు మంత్రి ఆలోచనలకు విరుద్ధంగా కనిపించేవి. అయినప్పటికీ ఆయనలోని దూరదృష్టి, దార్శనికత, సమగ్ర అవగాహన ఆధునిక ప్రయోగాల వైపు దృష్టి సారించేలా చేశాయి.
- డాక్టర్ జి.విజయ్ కుమార్ జీ, అధ్యక్షుడు, తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్