National Sports Awards: ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న గుకేష్, మను భాకర్

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విశ్వ విజేతగా భారత గ్రాండ్‌ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్‌ క్రీడల్లో భారత దేశ అత్యున్నత అవార్డు అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ను అందుకున్నాడు. శుక్రవారం(జనవరి 17) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి  గుకేష్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం విశేషం. 

Also Read :- రాహుల్, డుప్లెసిస్‌లకు బిగ్ షాక్

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన రెండవ భారతీయుడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. 2024 డిసెంబర్ నెలలో జరిగిన (14వ) గేమ్‌లో డింగ్ లిరెన్ తప్పిదం చేయడంతో గుకేష్ 7.5 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. గతంలో లెజెండరీ చెస్ స్టార్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచారు. గుకేష్ తో పాటు పారిస్ 2024 ఒలింపిక్స్ లో ఇండియాకు రెండు పతకాలు అందించిన షూటర్ మను భాకర్  ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. 

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి మెడల్‌‌‌‌గా బ్రాంజ్‌‌‌‌ అందించింది.  మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ తో కలిసి దేశానికి మరో పతకాన్ని అందించింది. భాకర్, గుకేష్‌లతో పాటు పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్ స్వర్ణం సాధించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్‌లకు కూడా  ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది.

ఒలింపిక్స్‌లో వరుసగా రెండు సార్లు దేశానికి  కాంస్య పతకాలు సాధించిన జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్ సభ్యుడు. గతేడాది పారిస్‌ పారాలింపిక్స్ హైజంప్‌లో ప్రవీణ్ స్వర్ణం సాధించాడు. మొత్తం 32 మంది అథ్లెట్లు అర్జున అవార్డుతో సత్కరించబడ్డారు. వీరిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. పారిస్ పారాలింపిక్స్ లో మన అథ్లెట్లు ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలతో సహా 29 పతకాలు దేశానికి తీసుకొచ్చారు.