మను భాకర్ ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అమ్మమ్మ, మేనమామ మృతి

హర్యానా: ఒలింపిక్ పతక విజేత, షూటర్ మను భాకర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆదివారం(జనవరి 19) జరిగిన రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ సావిత్రి దేవి(65), మేనమామ యుధ్వీర్ సింగ్(50) ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరు స్కూటీపై వెళ్తుండగా రాంగ్ రూటులో వచ్చిన కారు వీరి స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానాలోని చారికి దాద్రీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వేగంగా పోనిచ్చే ప్రయత్నం చేయడంతో బోల్తా పడింది. దాంతో, కారును వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ పరారైనట్లు.. పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్లు స్థానిక ఏఎస్సై సురేష్ కుమార్ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మను భాకర్‌ను ఇటీవల రాష్ట్రపతి ఖేల్ రత్న అవార్డుతో సత్కరించారు. ఈ సంతోషంలో ఉండగానే అతని కుటుంబంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.