టీమిండియా యువ షూటర్ మను బాకర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది. ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పారిస్ ఒలింపిక్స్ ముందువరకు ఎవరో తెలియని మను బాకర్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈమె సాధించిన ఘనతలకు కార్పొరేట్ కంపెనీలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.
మను బాకర్ కు పలు సంస్థల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రెండు, మూడురోజుల వ్యవధిలోనే ఆమెకు 40 ఆఫర్లు వరకు వచ్చాయని ఓఎస్ స్టోర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో, ఎండీ నీరవ్ తోమర్ వెల్లడించారు. ఆమె బ్రాండ్ విలువ దాదాపు ఆరు రెట్లు పెరిగిందని.. ఇంతకుముందు పాతిక లక్షల వరకు ఛార్జ్ చేసేవాళ్ళం.. ఇప్పుడు ఒక్కో దానికి దాదాపు రూ.1.5 కోట్లు వరకు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపించాయని ఆయన అన్నారు.
కొన్ని డిజిటల్ ఎంగేజ్‌మెంట్‌లు కూడా ఒక నెల, మూడు నెలలు.. ఇలా పలు సంస్థలు అప్రోచ్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ చాలా పతకాలు సాధించినా.. ఒలింపిక్స్ తో ఆమె బ్రాండ్ వాల్యూ బాగా పెరిగిపోయిందని నీరవ్ తెలిపారు. ఆదివారం (జూలై 28) జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మను మూడో ప్లేస్‌లో నిలిచి కంచు పతకం గెలిచింది. ఎనిమిది మంది పోటీ పడ్డ తుది పోరులో భాకర్ 221.7 స్కోరు సాధించింది. మంగళవారం (జూలై 30) జరిగిన10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను–సరబ్‌జోత్ సింగ్ 16–10తో లీ వోనోహో–ఓ యె జిన్ (సౌత్ కొరియా)పై గెలిచారు.