
- విమెన్స్ 25 మీ. పిస్టల్‌లో నాలుగో ప్లేస్
పారిస్ ఒలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకం గెలవాలన్న షూటర్ మను భాకర్ కల ఫలించలేదు..! హోరాహోరీగా సాగిన విమెన్స్ 25 మీ. పిస్టల్ ఫైనల్లో ఆఖర్లో ఆమెను అదృష్టం వరించలేదు..! చివరి సిరీస్‌లో ఒక్క పాయింట్ కూడా రాకపోవడంతో నాలుగో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది..! ఆర్చరీలో ఆశలు రేపిన దీపిక కుమారి క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది..!
చటౌరోక్స్ : ఇండియా సెన్సేషనల్ షూటర్ మను భాకర్.. ఒలింపిక్స్ మూడో పతకం వేటలో తడబడింది. శనివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో మను 28 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో నిలిచి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. 31 పాయింట్లు సాధించిన వెరోనికా మేజర్ (హంగేరి) మూడో ప్లేస్‌తో బ్రాంజ్‌ను సొంతం చేసుకుంది. యాంగ్ జిన్ (కొరియా), కామిల్లా (ఫ్రాన్స్)కు గోల్డ్, సిల్వర్ లభించాయి. ఎనిమిది మందితో కూడిన ఫైనల్లో ఓ దశలో భాకర్ నంబర్‌వన్ ప్లేస్‌లో నిలిచింది. కానీ నిలకడలేమితో క్రమంగా వెనకబడింది.
తొలి సిరీస్‌లో భాకర్ ఐదు టార్గెట్లలో రెండింటిని మాత్రమే ఛేదించింది. తర్వాతి రెండు సిరీస్‌ల్లో లోపాలను సరి చేసుకుని, గురి తప్పకుండా బుల్లెట్లు దింపింది. దీంతో 4, 4 పాయింట్లతో స్కోరు 10కి చేరింది. ఇక ఎలిమినేషన్ రౌండ్ ఆరంభంలో ఆధిక్యం చూపెట్టిన భాకర్‌కు జిన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. పర్ఫెక్ట్ గురితో ఆమె టాప్ ప్లేస్‌లోకి దూసుకుపోగా.. నాలుగు నుంచి 7 సిరీస్‌ల్లో భాకర్ వరుసగా 3, 5, 4, 4 పాయింట్లు సాధించింది. అయితే ఎనిమిదో సిరీస్‌లో మూడు షాట్లు మిస్ చేసి రెండే పాయింట్లు నెగ్గడంతో మూడో స్థానానికి పడిపోయింది. దీంతో స్కోరు 28గా మారింది. వెరోనికా కూడా 28 పాయింట్లే సాధించడంతో ఇద్దరి మధ్య షూటాఫ్ (9వ సిరీస్) నిర్వహించారు. ఇందులో భాకర్ ఒక్క పాయింట్ కూడా నెగ్గలేదు.
వెరోనికా మూడు పాయింట్లు సాధించి పతకాన్ని సొంతం చేసుకుంది. . కాగా, మెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్‌లో అనంత్‌జీత్ 116 పాయింట్లతో 24వ ప్లేస్‌తో నిష్ర్కమించాడు. విమెన్స్ స్కీట్ తొలి క్వాలిఫికేషన్‌లో మహేశ్వరి (24 పాయింట్లు) 8వ స్థానంతో ఫైనల్ రేసులో నిలిచింది. రైజా దిల్లాన్ (23) 25వ స్థానంలో ఉంది. మరో రెండు రౌండ్ల క్వాలిఫికేషన్ మిగిలి ఉంది.
‘ఫైనల్‌కు ముందు కాస్త ఒత్తిడికి లోనయ్యా. అయినా ప్రశాంతంగా ఉండటానికి చాలా ప్రయత్నించా. కానీ సాధ్యం కాలేదు. ఇది నా పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపింది. దీని నుంచి సానుకూలాంశాలను తీసుకుని 2028 ఒలింపిక్స్‌కు బలంగా తిరిగి వస్తా. నాకు రెండు మెడల్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే టైమ్‌లో నాలుగో ప్లేస్‌లో నిలిచినందుకు బాధగానూ ఉంది.
- మను భాకర్