ఒలింపిక్స్‌కు ముందు దేశం తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసిన మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మరోసారి మెరిసింది. వరుసగా రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి 12 ఏండ్ల కల తీర్చిన ఆమె.. మంగళవారం జరిగిన10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను–సరబ్‌జోత్ సింగ్ 16–10తో లీ వోనోహో–ఓ యె జిన్ (సౌత్ కొరియా)పై గెలిచారు.
ఈ ఒలింపిక్స్‌లో మనుకు ఇది రెండో పతకం కాగా, సరబ్‌జోత్‌కు మొదటిది. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లోనూ మను కాంస్యంతో మెరిసింది. ఫలితంగా స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా మను చరిత్రకెక్కింది. ఇండిపెండెన్స్‌కు ముందు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ పిచర్డ్.. 200 మీ. స్ప్రింట్, 200 మీ. హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు గెలిచాడు. ఈ విజయంతో మను భాకర్ దేశమంతా మారుమ్రోగుతుంది. తన విజయానికి కారణం చెప్పుకొచ్చింది.
"ఈవెంట్‌లకు (మహిళల 10 ఎయిర్ పిస్టల్ మరియు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్) ముందు నేను చాలా భయానికి గురయ్యాను. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. అంచనాలకు మించి ఆడి దేశానికి పతకాలు సాధించినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ పతకాలు నాకు చాలా ముఖ్యమైనవి. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌కు బాగా సిద్ధమయ్యాను. నా కోచ్ జస్పాల్ రాణా, నా తల్లిదండ్రులు పారిస్ ఒలింపిక్స్‌లో నేను సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించారు". " అని మను భాకర్ అన్నారు.