
ఒక పతకంతో 12 ఏండ్ల కల నెరవేర్చింది..! రెండో పతకంతో దేశం ఆశ్చర్యపో యేలా చేసింది..! ఒలింపిక్స్‌లో ఒక పతకం గెలిస్తేనే అద్భుతం అనుకుంటే.. ఇండియన్ స్టార్ షూటర్ మను భాకర్ ఏకంగా రెండో మెడల్‌ను కూడా పట్టేసింది..! 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన మను కాంస్యాన్ని కైవసం చేసుకుంది..! దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక ఇండియన్ అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించింది..!
చటౌరాక్స్ (ఫ్రాన్స్): లక్ష్యాన్ని మరవలేదు.. గురి చెదరలేదు.. ఒక పతకంతో సంతృప్తి పడలేదు. ఒలింపిక్స్‌కు ముందు దేశం తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసిన మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మరోసారి మెరిసింది. మంగళవారం జరిగిన10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను–సరబ్‌జోత్ సింగ్ 16–10తో లీ వోనోహో–ఓ యె జిన్ (సౌత్ కొరియా)పై గెలిచారు. ఈ ఒలింపిక్స్‌లో మనుకు ఇది రెండో పతకం కాగా, సరబ్‌జోత్‌కు మొదటిది. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లోనూ మను కాంస్యంతో మెరిసింది. ఫలితంగా స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా మను చరిత్రకెక్కింది. ఇండిపెండెన్స్‌కు ముందు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ పిచర్డ్.. 200 మీ. స్ప్రింట్, 200 మీ. హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు గెలిచాడు. మొత్తానికి టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ మొరాయించడంతో పతకాన్ని కోల్పోయిన మను ఈసారి రెండు మెడల్స్‌తో డబుల్ ధమాకాతో యావత్ దేశాన్ని పరవశంలో ముంచెత్తింది.
నాలుగు రౌండ్లలో జోరు..
భారీ ఆశలతో బరిలోకి దిగిన ఇండియన్ షూటర్లకు మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనింగ్ షాట్‌లో సరబ్ (8.6), మను (10.2)తో 18.8 పాయింట్లు సాధించారు. కానీ కొరియన్ ద్వయం 20.5 పాయింట్లతో 2–0 లీడ్‌లో నిలిచింది. మిక్స్‌డ్ ఈవెంట్‌లో ముందుగా 16 పాయింట్లు సాధించే వాళ్లకు మెడల్ ఇస్తారు. దీంతో 0–2తో ఆట మొదలుపెట్టిన మను–సరబ్ తర్వాతి నాలుగు రౌండ్లలో అద్భుతమైన గురితో నిలకడగా పాయింట్లు నెగ్గారు. ఫలితంగా 8–2 ఆధిక్యాన్ని సాధించారు. ముఖ్యంగా భాకర్ కాన్ఫిడెన్స్ అమోఘం. చివరి 13 షాట్లలో మూడుసార్లు మాత్రమే 10 కంటే తక్కువ పాయింట్లు సాధించింది.
మిగతా రౌండ్లలో ఒత్తిడిని జయించలేకపోయిన కొరియన్లు కీలక టైమ్‌లో గురి తప్పారు. ఫలితంగా 10 పాయింట్లతో సరిపెట్టుకున్నారు. కాగా, ఇండియా షాట్‌గన్ షూటర్ పృథ్వీరాజ్ తొండైమాన్.. ట్రాప్‌లో నిరాశపర్చాడు. రెండు రోజుల పాటు జరిగిన ఐదు రౌండ్ల క్వాలిఫికేషన్‌లో పృథ్వీ 118/125 పాయింట్లతో 21వ ప్లేస్‌లో నిలిచాడు. దీంతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. విమెన్స్ ట్రాప్‌లో రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ మూడు రౌండ్ల క్వాలిఫికేషన్ తర్వాత చెరో 68 పాయింట్లతో వరుసగా 21, 22వ స్థానాల్లో నిలిచారు. బుధవారం మరో రెండు రౌండ్లు జరుగుతాయి. ఇందులో నుంచి టాప్–6 ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
గర్వంగా ఉంది..
రెండు పతకాలు నెగ్గినందుకు గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులకు ధన్యవాదాలు. ప్రత్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించలేదు. మనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిద్దామని నేను సరబ్ భావించాం. రిలాక్స్‌డ్‌గా షూటింగ్ మొదలుపెట్టాం. ఒకే చోట నిలబడాలి. కాబట్టి నియంత్రణతో వ్యవహరించాం. ఆగస్టు 2 నుంచి జరిగే 25 మీటర్ల పిస్టల్‌లోనూ నా బెస్ట్ ఇస్తా. ఒకవేళ ఆశించిన ఫలితం రాకుంటే ఎవ్వరూ నిరుత్సాహపడకుండా నాపై ఇదే ప్రేమను కొనసాగిస్తారని ఆశిస్తున్నా.
- మను భాకర్