Manu Bhaker: డాక్టర్లు, ఇంజనీర్లు కాదు.. విద్యార్థులకు మను బాకర్ సలహా

Manu Bhaker: డాక్టర్లు, ఇంజనీర్లు కాదు.. విద్యార్థులకు మను బాకర్ సలహా

భారత మహిళా షూటర్‌ మను బాకర్ ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత మను భాకర్‌ యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో  చెన్నైలోని వెలమ్మాళ్ నెక్సస్ స్కూల్‌ను సందర్శించింది. ఈ మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ తన అనుభవాలను స్టూడెంట్స్ తో  పంచుకుంది. విలువైన సూచనలు ఇస్తూ సందడి చేసింది. 

22 ఏళ్ల ఆమె.. క్రీడలను కెరీర్ గా ఎంచుకుంటే జీవితం చాలా అందంగా ఉంటుందని.. ప్రతి ఒక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. పెద్ద కలలను కనాలని.. వాటి కోసం కఠోర దీక్ష చేయాలనీ ఆమె చెప్పారు. కలలు సాకారం కానంత మాత్రాన నిరాశ చెందకూడదని.. లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని ఆమె విద్యార్థులకు వివరించింది. ఎప్పుడూ ఆత్మ విశ్వాసంతో ఉండాలని .. కెరీర్ లో గొప్ప స్థితికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలున్నాయని చెప్పుకొచ్చింది. 

"నా కెరీర్ లో చాలా భిన్న పరిస్థితులు, భిన్న సంస్కృతులు చూశాను. నా ఎనిమిదేళ్ళ వయసులోనే ప్రపంచమంతా తిరిగా. మన సాంస్కృతిక నేపథ్యం గురించి మనమెప్పుడూ సిగ్గు పడకూడదు. చాలా గర్వపడాలి. ఒకప్పుడు నాకు చాలా విషయాలు తెలిసేవి కావు. కానీ నేర్చుకున్నా. మన మూలాల గురించి మనం ఎప్పుడూ సిగ్గు పడకూడదు. మా అమ్మే నాకు అతి పెద్ద ప్రేరణ" అని మను తన కెరీర్ గురించి విద్యార్థులతో చర్చించింది.