
- గతేడాది ఈదురు గాలులకు తీవ్ర నష్టం
- ఈ సారి మార్కెట్ లో రేట్ ఆశాజనకం
- ఉన్న ఊర్లోనే కూలీలకు మెరుగైన ఉపాధి
మెదక్, నిజాంపేట్, వెలుగు: ఆమ్ చూర్(మామిడి టంకర) తయారీ అటు వ్యాపారులకు ఆదాయాన్ని, ఇటు కూలీలకు మెరుగైన ఉపాధిని కల్పిస్తోంది. గతేడాది అకాల వర్షాలు, ఈదురు గాలులతో పెద్ద మొత్తంలో మామిడి కాయలు రాలిపోయి ఆమ్చూర్వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిళ్లగా, కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి అకాల వర్షాలు కురిసినప్పటికీ నష్టం పెద్దగా లేకపోవడంతో కూలీలకు మెరుగైన ఉపాధి లభిస్తుండడంతో పాటు, మార్కెట్ లో ఆమ్చూర్కు ఆశాజనకమైన రేటు లభిస్తుండడంతో వ్యాపారులు సంతోషిస్తున్నారు.
భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో, విదేశాల్లో వంటకాలలో చింతపండుకు బదులుగా వాడే ఆమ్ చూర్ ను మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున తయారు చేస్తారు. ఆమ్ చూర్ తయారీ దారులు ప్రతీ ఏటా జనవరిలో మామిడి తోటలను గుత్త లెక్కన కొనుగోలు చేస్తారు. మామిడి కాయలు కోతకు రాగానే ఏప్రిల్, మే నెలల్లో కాయలను తెంపి కూలీలను పెట్టి మామిడి కాయల తొక్క తీసి, ముక్కలుగా కోసి బండలపై ఆరబోస్తారు. బాగా ఎండిన తర్వాత అవి ఆమ్ చూర్ గా తయారవుతాయి. వీటిని హైదరాబాద్ లోని మలక్ పేట, నిజామాబాద్ మార్కెట్లకు తీసుకెళ్లి హోల్ సేల్ వ్యాపారులకు అమ్ముతారు. అక్కడ వారు గ్రేడింగ్ చేసి ఆమ్ చూర్కిలో, రెండు కిలోలు, ఐదు కిలోలు, పది కిలోల చొప్పున ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,500 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. మామిడి కాయలు కోతకు రావడంతో కొద్ది రోజులుగా జిల్లాలోని నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, హవేలీ ఘనపూర్, మెదక్, కొల్చారం, వెల్దుర్తి మండలాల పరిధిలో ఆమ్ చూర్ తయారీ ముమ్మరంగా సాగుతోంది. ఆయా చోట్ల తయారు చేసే ఆమ్ చూర్ ను వ్యాపారులు హైదారాబాద్, నిజామాబాద్ మార్కెట్లకు తరలిస్తున్నారు.
చేతినిండా పని
మామిడి టంకర తయారీ ద్వారా ప్రతీ ఏటా ఎండాకాలంలో రెండు నెలల పాటు కూలీలకు మంచి ఉపాధి లభిస్తుంది. ఊర్లోనే నీడ పట్టున కూర్చుని చేసే పని కావడంతో మహిళలు, పిల్లలు టంకర తయారీ పనులకు వెళ్తున్నారు. వంద మామిడి కాయలు కోసి టంకర తయారు చేసినందుకు రూ.50 చొప్పున చెల్లిస్తున్నారు. ఒక్కొక్కరూ రోజుకు 500 నుంచి 600 కాయలు కోస్తారు. బాగా అనుభవం ఉన్న వారు వెయ్యి కాయల వరకు కోసి ఆమ్ చూర్ తయారు చేస్తారని టంకర వ్యాపారులు చెబుతున్నారు.
రేట్ పర్వాలేదు
ఆమ్ చూర్క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. నాణ్యంగా ఉంటే మంచి ధర పలుకుతుంది. ఈ సారి మార్కెట్లో ఆమ్ చూర్ రేట్ పర్వాలేదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో క్వింటాలు ధర రూ.25 వేలు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధర పర్వాలేదని తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు.
ప్రతీయేడు ఆమ్ చూర్ తయారు చేపిస్తాం
మా తాత తండ్రుల కాలం నుంచి మేము ఆమ్ చూర్ తయారు చేపిస్తున్నాం. పూత దశలో ఉన్న మామిడి తోటలను గుత్త పట్టుకుంటాం. అవి కోతకు రాగానే కాయలను తెంపి గ్రామంలోని మహిళలతో ఆమ్ చూర్ తయారు చేపిస్తం. తర్వాత తయారు చేసిన ఆమ్ చూర్ ను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తాం. ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్లో ఆమ్ చూర్ నెంబర్ వన్ మాల్ కి రూ.25 వేల ధర పలుకుతోంది. ఈ ధరను ఇంకా కొంచెం పెంచితే బాగుండేది. ఆమ్ చూర్ అమ్మగా వచ్చిన పైసలు ఆడికాడికి అవుతున్నాయి. - శేఖర్, కల్వకుంట
రెండు నెలలు ఉపాధి
ఎండ కాలంలో పని లేక ఖాళీగా కూర్చుంటున్న మాకు ఆమ్ చూర్ తయారీ వల్ల రెండు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. కరువు కాలంలో మేము ఇదే పని చేసుకుని బతుకుతాం.100 మామిడికాయల టంకర తయారు చేస్తే రూ. 50 చొప్పున కూలి కట్టిస్తరు. -
- రంగ పద్మలత, కల్వకుంట