బ్రాండెడ్ పేర్లతో కల్తీ ఐస్ క్రీమ్​లు తయారీ

యాదాద్రి, వెలుగు: వివిధ బ్రాండ్ల పేరుతో కల్తీ ఐస్ క్రీమ్​లు తయారు చేస్తున్న సెంటర్​పై యాదాద్రి ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐస్​క్రీమ్​ తయారీ కోసం వాడుతున్న వేలాది కవర్లను సీజ్ చేసి, తయారీదారుడిని అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లా, ఆలేరుకు చెందిన ఎండీ చాంద్​మియా కొంతకాలంగా వివిధ కంపెనీల పేరుతో ఐస్​క్రీమ్​లు తయారు చేస్తున్నాడు.

హైదరాబాద్ బేగంబజార్ నుంచి వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న ఐస్ క్రీమ్ రేపర్లు, ఫ్లేవర్ లిక్విడ్ బాటిళ్లు, ఐస్ క్రీమ్ స్టిక్స్ తెప్పించి వాడుతున్నాడు. అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీమ్ లు తయారు చేయడమే కాకుండా బ్రాండెడ్ కంపెనీల రేపర్లలో ఉంచి, వాటిని రిటైలర్లకు అమ్ముతున్నాడు.

కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీపై ఫిర్యాదు అందడంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేయగా.. వివిధ బ్రాండ్ల పేర్లతో ఉన్న 18 వేల ఐస్ క్రీమ్ రేపర్లు దొరికాయి. మ్యాంగో, ఆరెంజ్ ఫ్లేవర్ లిక్విడ్ బాటిళ్లు, స్టిక్స్, చక్కెర బస్తాను కూడా స్వాధీనం చేసుకున్నారు. చాంద్ మియాను అరెస్ట్ చేసి ఆలేరు పోలీసులకు అప్పగించారు.