మానుకోటపై రెండోసారి జెండా ఎవరిదో!

  •     మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు 
  •     అంతా ఒక్కోసారి ఎంపీగా గెలిచిన వాళ్లే
  •     రెండోసారి విజయం కోసం ప్రయత్నం
  •     ఆసక్తిగా మారనున్న మానుకోట ఎంపీ ఎలక్షన్​ 

మహబూబాబాద్​, వెలుగు : మూడు ప్రధాన పార్టీల నుంచి   బలమైన అభ్యర్థులతో మానుకోట ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.  కాంగ్రెస్​ నుంచి బలరామ్​ నాయక్​, బీజేపీ నుంచి సీతారామ్​ నాయక్​, బీఆర్​ఎస్​ నుంచి మాలోత్​ కవిత భరిలో ఉన్నారు. పార్లమెంట్​ నియోజకవర్గంలో ఈ అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కోసారి ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో గెలిచి, రెండోసారి తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో 2009 తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​  ఎంపీ అభ్యర్థి  పోరిక బలరాం నాయక్​ గెలిచారు. అప్పుడూ తొలిసారే  కేంద్ర సామాజిక శాఖ  మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి  ప్రొఫెసర్​ అజ్మీరా సీతారాంనాయక్​,  2019 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి మాలోత్​ కవిత ఎంపీగా గెలిచారు. 

రెండోసారి గెలిచేందుకు .. 

మానుకోట ఎంపీగా 2024  పార్లమెంట్​ ఎన్నికల్లో రెండోసారి గెలిచేందుకు ఈ ముగ్గురు అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు.   పార్లమెంట్​ పరిధిలో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు.   ముగ్గురికి పార్లమెంట్​ వ్యాప్తంగా విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి.  ఈ పార్లమెంట్​ పరిధిలో ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఉండడంతో  ఆ పార్టీ అభ్యర్థి పోరిక బలరామ్​ నాయక్​  ఎన్నికల్లో గెలుపు పై ధీమాతో ఉన్నారు.   మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో  మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, నర్సంపేట, కొత్తగూడ  నియోజకవర్గాల పరిధిలో  ఇటీవల  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  అభ్యర్థులు  మెజార్టీతో  గెలుపొందారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వంద రోజుల పరిపాలన కాలంలో  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో,  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోను ప్రజలు భారీ మెజార్టీ కట్టబెడతారని బలమైన విశ్వాసంతో తన ప్రచారాన్ని  చేస్తున్నారు.  కేంద్ర మంత్రిగా గతంలో సేవలు అందించడంతో  పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో పరిచయాలు ఉండడంతో, గతంలో రెండు పర్యాయాలు ఓటమి చెందడంతో  ఆ సానుభూతితో నేడు ఆయనకు భారీ మెజార్టీ  చేకూరాలని కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు.

మోదీ నినాదంతో సీతారామ్​ నాయక్​.. 

మరోసారి మోదీ నినాదంతో బీజేపీ నేతలు మానుకోటలో ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అమలు జరగాలంటే ఎంపీ అభ్యర్థిగా తనను ఆదరించాలని కోరుతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి   ప్రచారాన్ని  చేస్తున్నారు.  

తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో .. బీఆర్​ఎస్​

తెలంగాణ పునర్​ నిర్మాణం పేరుతో బీఆర్​ఎస్​ నాయకులు ప్రచారం చేస్తున్నారు.  ఇప్పటికే వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో  కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. బీఆర్​ఎస్​ నుంచి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఉన్నప్పటికీ  ఆయన పూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. పార్టీ క్యాడర్​ను మాత్రమే నమ్ముకుని  ప్రచారం నిర్వహిస్తున్నారు.