సామాజిక సేవలో ఫ్రెండ్లీగా.. మానుకోట పోలీసులు  

సామాజిక సేవలో ఫ్రెండ్లీగా.. మానుకోట  పోలీసులు  
  • నిరుపేద అంధుడికి  గృహ నిర్మాణం 
  • ఏజెన్సీ ఏరియాలో మెడికల్ క్యాంపులు, మెటీరియల్స్ పంపిణీ
  • రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గుంతల పూడ్చివేత
  • గుడుంబా నియంత్రణకు దాడులు
  • ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా అడుగులు

మహబూబాబాద్, వెలుగు: సమాజంలో పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కాదని మానుకోట పోలీసులు నిరూపిస్తున్నారు. సామాజిక సేవలో నిమగ్నమవుతూ, పేదలకు తమవంతు సాయం చేస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల నష్టాలను వివరిస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో వైద్య శిబిరాలు, ప్రధాన రహదారుల పై గుంతల పూడ్చివేత, గుడుంబా నియంత్రణకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ నేతృత్వంలో జిల్లాలో ఆ శాఖ సిబ్బంది ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా అడుగులు వేస్తూ, ప్రజల మన్ననలు 
పొందుతున్నారు.

అంధుడికి గృహ నిర్మాణం..

మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం పెద్దనాగరంలో మందుల నాగన్న చిన్నప్పుడే రెండు కండ్లు కోల్పోవడంతో తల్లితోపాటు గ్రామంలో నివసిస్తున్నాడు. ఖమ్మం బస్టాండ్ లో కంజెర వాయిస్తూ, పాటలు పాడుకుంటూ భిక్షాటన చేస్తూ  జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు నాగన్న ఇల్లు మొత్తం కూలిపోయే స్థితికి చేరింది. ఇది చూసిన నరసింహులపేట  ఎస్సై సతీశ్​ ఉన్నతాధికారుల సూచనలతో, దాతల సహకారంతో నూతనంగా ఇల్లు నిర్మించారు. ఈ నెల 28న మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​కేకన్ కుటుంబ సభ్యులతో గృహప్రవేశం చేయించారు. 

సామాజిక బాధ్యతతో ముందుకు..

మహబూబాబాద్ జిల్లాలో  పోలీసులు సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులపై వర్షాలతో భారీగా గుంతలు ఏర్పడటంతో ప్రమాదాల నియంత్రణకు గుంతలను పూడ్చారు. జిల్లాలో గుడుంబా నియంత్రణకు తండాలు, పల్లెల్లో మెరుపు దాడులు చేస్తూ వేల లీటర్ల బెల్లం, చక్కెర పానకాన్ని ధ్వంసం చేస్తున్నారు. గ్రామాల్లో కళాజాత బృందాలతో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు, స్కూల్​ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ, యువతకు క్రీడా మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. పోలీసుల సామాజిక సేవకు జిల్లా ప్రజలు ఫిదా  అవుతున్నారు.

ఫ్రెండ్లి పోలీసింగ్​లో  భాగంగానే..

మహబూబాబాద్ జిల్లాలో ఫ్రెండ్లి పోలీసింగ్ అమలులో భాగంగానే వివిధ కార్యక్రమాలను పోలీస్ సిబ్బంది సహకారంతో నిర్వహిస్తున్నాం. గుడుంబా, గంజాయి నివారణకు చర్యలు ముమ్మరం చేశాం. శాంతి భత్రతల పరిరక్షణతోపాటు సామాజిక బాధ్యతతో సిబ్బంది ముందుకు సాగాలి.  


- సుధీర్​ రామ్​నాథ్​​ కేకన్​,  మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ