మానుకోట స్టేషన్​కు కొత్తకళ

మానుకోట స్టేషన్​కు కొత్తకళ
  • అమృత్​ ఫండ్​రూ.39.42 కోట్లతో కొనసాగుతున్న మానుకోట రైల్వేస్టేషన్​ పనులు
  • ముమ్మరంగా మూడో రైల్వే లైన్​నిర్మాణం
  • డబ్లింగ్​పనుల నిర్వహణకు లైన్​ క్లియర్​

మహబూబాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని మానుకోట రైల్వే స్టేషన్​అమృత్​భారత్ పథకంలో భాగంగా రూ.39.42 కోట్లతో చేపడుతున్న పనులు స్పీడప్​ అయ్యాయి. 2023లో ప్రారంభమైన ఈ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఒకటో నెంబర్  ఫ్లాట్​ఫామ్​వైపు పనులు వేగవంతం కాగా, వెయిటింగ్​హాల్, షెడ్ల ఏర్పాటు, స్టేషన్​ వెలుపల పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తైతే మానుకోట రైల్వే స్టేషన్​ రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. 

స్పీడందుకున్న మూడో రైల్వే  లైన్​ నిర్మాణ పనులు

ఖాజీపేట నుంచి మహబూబాబాద్​మీదుగా విజయవాడ వైపు నూతనంగా ఎక్స్​ప్రెస్​ వే రైల్వే, మూడో  లైన్​ పనులు స్పీడందుకున్నాయి. మహబూబాబాద్​ పట్టణంలో రెండో  నెంబర్​ ఫ్లాట్​ఫామ్​సమీపం నుంచి మూడో లైన్​పనులు చేపడుతున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్​ డివిజనల్​ రైల్వే మేనేజర్​భర్తేష్​కుమార్​ జైన్​ పనుల పురోగతిని పరిశీలించారు.

డబ్లింగ్​పనుల నిర్వహణకు గ్రీన్​ సిగ్నల్..​

జిల్లాలోని డోర్నకల్​నుంచి భద్రాచలం రోడ్​ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే లైన్​ డబ్లింగ్​పనుల నిర్వహణకు డోర్నకల్, గార్ల మండలాల పరిధిలో భూ సేకరణకు 2024 జూలై12 న నోటిఫికేషన్​ జారీ చేయగా, ఇటీవల పనుల నిర్వహణ ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఈ మార్గంలో 54.43 కిలోమీటర్ల పొడవు సిగ్నల్​ లైన్​ఉంది. డబ్లింగ్ పనులు పూర్తైతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.​ పోచారం, కారేపల్లి, గాంధీపురంహల్ట్, చీమలపహడ్, తడికలపూడి, బేతంపూడి ఆరు స్టేషన్లలో  సౌకర్యాలు పెరుగనున్నవి. ప్రస్తుతం సింగల్​ లైన్​పై మణుగూరు_ సికింద్రాబాద్​ఎక్స్​ప్రెస్, భద్రాచలం రోడ్, సికింద్రాబాద్​కాకతీయ ఎక్స్​ప్రెస్, సిర్పూర్​ టూన్​ భద్రాచలంరోడ్, సింగరేణి, విజయవాడ_ భద్రాచలం రోడ్​ప్యాసింజర్​ రైళ్లు నడుస్తున్నా సరిపోవడం లేదు. 

సింగిల్​ లైన్​ కష్టాలు తీరితే డోర్నకల్​స్టేషన్​ మీదుగా సికింద్రాబాద్, విజయవాడ, బల్లర్షా వైపునకు మరిన్ని రైళ్లు నడిచే అవకాశం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం సీతారామ చంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత అనువుగా మారనున్నది. డోర్నకల్_ భద్రాచలం డబ్లింగ్​పనులకు రూ.770.12 కోట్లు అంచనా వేయగా 2023_24లోనే రైల్వే బడ్జెట్​లో రూ.100 కోట్లను కేటాయించారు. నల్లగొండ జిల్లా దామెరచర్ల థర్మల్​పవర్​స్టేషన్​కు కొత్తగూడెం, మణుగూరు  ప్రాంతాల్లోని బొగ్గు గనుల నుంచి  డోర్నకల్​ రైల్వే జంక్షన్​ నుంచి బొగ్గు రవాణా కానున్నది.