పోరు తెలంగాణకు గద్దర్​ గొంతుకే ఆయుధం : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రజా యుద్దనౌక గద్దర్​ గొంతుకే పోరు తెలంగాణకు ఆయుధంగా మారిందని పలువురు అఖిలపక్ష నేతలు అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్​లో అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో గద్దర్​తో పాటు సియాసత్​ ఉర్ధూ పత్రిక మేనేజింగ్​ ఎడిటర్​ జహీర్​ అలీఖాన్​కు రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలు, కవులు, కళాకారులు ఘనంగా సాంస్కృతిక నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు రాములు, గద్దర్​ కుమార్తె డాక్టర్​ వెన్నెల, రచయిత జయరాజ్​ మాట్లాడారు. 

దొరల గడీల పాలనపై ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్​ అని అన్నారు. ప్రజల మాటలనే పాటలుగా అల్లిన ప్రజా కవి గద్దర్​ అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక పోరులో సాంస్కృతిక ప్రోగ్రాంల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన గొప్ప వ్యక్తి గద్దర్​ అని అన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే ప్రజా గొంతుకగా గద్దర్​ ఉండేవారన్నారు. ప్రజలను తన పాటలు, మాటలతో చైతన్యం చేశారని, ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. సాంస్కృతిక విప్లవానికి ఐకాన్​గా గద్దర్​ నిలిచారన్నారు. 

హిందూ, ముస్లీం మతోన్మదాన్ని వ్యతిరేకించిన లౌకిక, ప్రజాస్వామ్య వాది జహీర్​ అలీఖాన్​ అని అన్నారు. ఈ ప్రోగ్రాంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్​, న్యూడెమోక్రసీ, టీవీపీఎస్​, ప్రజాసంఘాల నేతలు కాసాని ఐలయ్య, ఎస్​కె. సాబీర్​ పాషా, అన్నవరపు కనకయ్య, శౌరి, రామనాదం, గొల్లపల్లి దయానంద్​, ఆవునూరి మదు, ముద్ద బిక్షం, గుండపనేని సతీష్​, కె. శ్రీనివాస్​, బందెల నర్సయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్​. పాల్​, బల్లేపల్లి మోహన్​, మిట్టపల్లి సురేందర్​ కళా బృందాలు గద్దర్​ పాటలతో అలరించాయి.