విశ్లేషణ: ఎస్జీటీ పోస్టులు డీఎడ్ అభ్యర్థులకే దక్కాలె

విశ్లేషణ: ఎస్జీటీ పోస్టులు డీఎడ్ అభ్యర్థులకే దక్కాలె

సెకండరీ గ్రేడ్​ టీచర్(ఎస్జీటీ)​పోస్టులకు డిప్లొమా ఇన్​ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని 2011లో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు నేషనల్ ​కౌన్సిల్ ఫర్ ​టీచర్​ఎడ్యుకేషన్(ఎన్​సీటీఈ) గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ కూడా జారీ చేసింది. దాని ప్రకారమే రాష్ట్రంలో చేపట్టిన నియామకాల్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌‌‌‌ అభ్యర్థులను తీసుకోలేదు. కానీ సుప్రీం తీర్పుకు విరుద్ధంగా ఎన్​సీటీఈ ఎస్జీటీ పోస్టులకు బీఎడ్​వారిని కూడా అర్హులుగా చేస్తూ మళ్లీ గెజిట్​ నోటిఫికేషన్ ​జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో డీఎడ్​చేసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. బీఎడ్​ వారితో పోలిస్తే ప్రైమరీ పిల్లలకు బోధించే అన్ని అర్హతలు డీఎడ్ ​వారికే ఎక్కువ ఉన్నాయి. పైగా బీఎడ్​ పూర్తి చేసిన వారికి స్కూల్​ అసిస్టెంట్ పోస్టులతో పాటు గురుకులాలు, కేజీబీవీ, నవోదయ స్కూళ్లలో అవకాశాలు ఉన్నాయి. డీఎడ్​చేసిన వారికి ఒక్క ఎస్జీటీ పోస్టులు తప్ప వేరే అవకాశాలు లేవు. ఎన్​సీటీఈ నిబంధనలు సవరించాలి.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాథమిక బడుల్లో  2006 డీఎస్సీ వరకు1 నుంచి 5వ తరగతి వరకు బోధించే టీచర్ పోస్టులకు డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన అందరికీ అవకాశం ఉండేది. రెండేండ్ల ఉపాధ్యాయ శిక్షణలో ప్రైమరీ స్కూలు పిల్లల సైకాలజీ సబ్జెక్టును చదువుకుంటామని, వారికి విద్య బోధించేందుకు తమకే అన్ని అర్హతలు ఉంటాయని ప్రభుత్వ డైట్​కాలేజీ డీఎడ్​స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర ట్రిబ్యునల్​లో పిల్​వేశారు. తర్వాత ఆ వివాదం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. వాదనలు విన్న కోర్టు 30 శాతం ఎస్టీజీ పోస్టులను డీఎడ్​వారికే కేటాయించి, మిగతా 70 శాతంలో మెరిట్ ప్రాతిపదికన అందరికి ఇవ్వాలని తీర్పు వెలువరించింది. దాని ప్రకారం 2008 డీఎస్సీలో డీఎడ్ అభ్యర్థులు30 శాతం కోటా పొందారు. అప్పటి వరకు  రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ డైట్ కాలేజీలు మాత్రమే ఉండేవి. బీఎడ్ అభ్యర్థులు జిల్లాకు30 వేల చొప్పున ఉంటే, డీఎడ్ చేసిన వారు వందల్లోనే ఉండేవారు. 30 శాతం స్పెషల్​కోటాతో ఉమ్మడి రాష్ట్రంలో డీఎడ్ కోర్సుకు భారీగా డిమాండ్​పెరిగి ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు కాలేజీలు వచ్చాయి. ప్రైమరీ స్కూలు పిల్లలకు బోధించేందుకు తమకు మాత్రమే అన్ని అర్హతలు ఉన్నాయని, 30 శాతం కోటా కాదు 100 శాతం ఎస్జీటీ పోస్టులను కేవలం డీఎడ్ అభ్యర్థులకే ఇవ్వాలని డీఎడ్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిల్​వేశారు. సుదీర్ఘకాలం పాటు  కోర్టులో వాదనలు సాగాయి. 2011లో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా100 శాతం ఎస్టీజీ పోస్టులను కేవలం డీఎడ్ అభ్యర్థులకే కేటాయించాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు మేరకు 2011 ఆగస్టు 25 న ఎన్​సీటీఈ గెజిట్ జారీ చేసింది.

సుప్రీం తీర్పుతో నియామకాలు
సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో 2012 డీఎస్సీలో డీఎడ్ అభ్యర్థులకు మేలు జరిగింది. 2012 డీఎస్సీ నోటిఫికేషన్​లో ఎస్జీటీ ఖాళీలే 12 వేలు ఉండటంతో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే 2011 జూన్ మొట్ట మొదటి టెట్ లో నిబంధనలు మార్చకపోవడం వల్ల బీఎడ్ పూర్తి చేసిన వారికి కూడా ఎస్జీటీల కోసం నిర్వహించే పేపర్1కు అవకాశం ఇచ్చారు. 2011 డిసెంబర్ లో సుప్రీం తీర్పుకు అనుగుణంగా టెట్ నిబంధనలు మార్చారు. అప్పటి నుంచి టెట్ పేపర్1 కేవలం డీఎడ్ వారికే కేటాయించారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 200 డీఎడ్ ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2017లో నిర్వహించిన టీఆర్టీలో 5,145 పోస్టులకు దాదాపు 70 వేల మంది డీఎడ్ అభ్యర్థులు పోటీ పడ్డారు. 

ఉత్తరప్రదేశ్ ​లెటర్​తో మార్పులు?
తమ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయని, పోస్టులకు సరిపోను డీఎడ్ అభ్యర్థులు రాష్ట్రంలో లేరని, బీఎడ్ చేసిన వారిని కూడా ఎస్జీటీ పోస్టులకు అనుమతించాలని ఉత్తరప్రదేశ్​ప్రభుత్వం ఎన్​సీటీఈకి లేఖ రాసింది. దీంతో బీఎడ్ పూర్తి చేసిన వారికి కూడా ఎన్​సీటీఈ ఎస్జీటీ పోస్టులకు అవకాశం ఇచ్చింది. అయితే తప్పనిసరిగా 6  నెలల ప్రాథమిక స్థాయి బ్రిడ్జి కోర్స్ పూర్తి చేయాలని పేర్కొంటూ అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేయాలని 2018 జూన్ 28న గెజిట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 2018 జూన్ లోపు 2 సార్లు టెట్, ఒకసారి టీఆర్టీ నిర్వహించింది. దీంతో ఎలాంటి సమస్య రాలేదు.5  సంవత్సరాలుగా టెట్ కూడా నిర్వహించలేదు కాబట్టి ఆ వివాదం కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు రాలేదు. 

రాజస్థాన్​ రాష్ట్రంలోనూ..
రాజస్థాన్​రాష్ట్ర ప్రభుత్వం 2021 నవంబర్ లో నిర్వహించిన ఎస్జీటీ పోస్టుల రిక్రూట్​మెంట్​లో బీఎడ్ పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చింది. దీనిపై ఆ రాష్ట్ర డీఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్​వారిని అనుమతించే ఎన్​సీటీఈ గెజిట్​నోటిఫికేషన్ 2011 సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్​వారికి కేటాయించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం రాజస్థాన్ ప్రభుత్వం కేవలం డీఎడ్​అభ్యర్థుల ఫలితాలనే ప్రకటించి, బీఎడ్ వారి రిజల్ట్​ఆపింది. తర్వాత రాజస్థాన్​హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. ఎన్​సీటీఈ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్​హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్జీటీ పోస్టుల రిక్రూట్​మెంట్​కు కేవలం డీఎడ్​అభ్యర్థులనే అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణలోనూ డీఎడ్​అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఎన్​సీటీఈ జారీ చేసిన గెజిట్​నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పుకు, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని ఇటీవల జరిగిన విచారణలో డీఎడ్​అభ్యర్థుల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎన్​సీటీఈ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో టెట్ మాత్రమే జరుగుతోందని, ఇంకా ఉపాధ్యాయ నియామకాలు జరగడం లేదని, దీనిపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నట్లు తెలిపారు. దీంతో కోర్టు కేసును జులై 5 కి వాయిదా వేసింది. 

డీఎడ్​ అభ్యర్థులకే అన్ని అర్హతలు..
ప్రైమరీ స్కూలు పిల్లలకు బోధించేందుకు బీఎడ్​వారితో పోలిస్తే డీఎడ్​పూర్తి చేసిన అభ్యర్థులకే అన్ని అర్హతలు ఉంటాయి. బీఎడ్ అభ్యర్థి తన ఉపాధ్యాయ శిక్షణలో సబ్జెక్ట్​ మెథడాలజీతోపాటు ఒక లాంగ్వేజ్​ను మాత్రమే చదువుతాడు. ఎడ్యుకేషన్​సైకాలజీ పూర్తిగా హైస్కూలు పిల్లవాడి మానసిక పరిస్థితిపైనే ఉంటుంది. లాంగ్వేజ్​తో కలిపి రెండు సబ్జెక్టుల మెథడాలజీలు చదువుకున్న బీఎడ్​ అభ్యర్థి ప్రైమరీ స్కూలులో అయిదు సబ్జెక్టులు బోధించడం న్యాయం చేసినట్లు అవుతుందా? అదే డీఎడ్ ​స్టూడెంట్​ శిక్షణలో అయిదు సబ్జెక్టుల మెథడాలజీలు చదువుతాడు. ఎడ్యుకేషన్​ సైకాలజీ కూడా పూర్తిగా ప్రైమరీ స్కూలు పిల్లవాడిని కేంద్రంగా చేసుకునే ఉంటుంది. ఇలా బీఎడ్ ​వారితో పోలిస్తే డీఎడ్​ పూర్తి చేసిన వారే ఎస్జీటీలుగా విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో న్యాయం చేయగలరు. 

బీఎడ్​ అభ్యర్థులకూ న్యాయం జరగాలె..
రాష్ట్రంలో స్కూల్​ అసిస్టెంట్ల రిక్రూట్​మెంట్​ విషయంలో బీఎడ్​ అభ్యర్థులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం స్కూల్​ అసిస్టెంట్ల ఖాళీల్లో 70 శాతం ఎస్జీటీలను ప్రమోషన్ల ద్వారా నింపుతుండగా, 30 శాతం పోస్టులను మాత్రమే డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ చేస్తోంది. అలా కాకుండా.. 70 శాతం పోస్టులను డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ ద్వారా నింపాలి. అప్పుడే ఖాళీల సంఖ్య పెరిగి బీఎడ్ ​అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. 

– రామ్మోహన్ రెడ్డి, 

డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర​ అధ్యక్షుడు